చేనేత వస్త్రాలే వాడుదాం | - | Sakshi
Sakshi News home page

చేనేత వస్త్రాలే వాడుదాం

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

పాలిథిన్‌ శాలువాలు బంద్‌ చేద్దాం

మంత్రి పొన్నం ప్రభాకర్‌

డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి

జిల్లాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

హుస్నాబాద్‌: అతిథులకు పాలిథిన్‌ శాలువాలు బంద్‌ చేసి నేతన్నలు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చేనేత వస్త్రాలు ప్రొత్సహించాలని, చేనేత వస్త్రాలు ధరించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంభానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చేనేత వస్రాలను వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ పెట్టుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ప్రకృతిని కాపాడుదాం

ప్రకృతిని సమతుల్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటి పెంచడం భవిష్యత్‌ తరాలకు మనమిస్తున్న వరమన్నారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, మాజీ గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌ లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ శివయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ భిక్షపతి, కాంగ్రెస్‌ పట్టణ అద్యక్షుడు వెంకటరమణ. కౌన్సిలర్లు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

గజ్వేల్‌: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గజ్వేల్‌లో చేనేత మగ్గం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత రంగంలోకి కార్పొరేట్‌ సంస్థల రంగ ప్రవేశంతో కార్మికుల జీవితాలు దయనీయంగా మారుతున్నాయని చెప్పారు. కేంద్రం కార్పొరేట్‌ సంస్థల ప్రమేయాన్ని తగ్గించి, చేనేతకు అవసరమయ్యే ముడి సరుకుకు జీఎస్‌టీని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాజేశం, గజ్వేల్‌ మార్కెట్‌ కమీటీ వైస్‌ చైర్మన్‌ సర్ధార్‌ఖాన్‌, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మజీద్‌ కమీటీ అధ్యక్షుడు మతిన్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వదేశీ వస్త్రాలనే ధరిద్దాం

దుబ్బాక: చేనేత రంగాన్ని రక్షించుకునేందుకు స్వదేశీ వస్త్రాలనే ధరించాలని చేనేత సహకార సంఘం చైర్మన్‌ అంకం మధు అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దుబ్బాకలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నల బలోపేతానికి అందరూ పాటుపడాలన్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన దుబ్బాక నేత కార్మికులకు చేతినిండా పనికల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement