ప్రాణాలు నిలిపే గోల్డెన్ అవర్
సమాచారం ఇద్దాం.. ఆస్పత్రికి తరలిద్దాం..
సంగారెడ్డిక్రైమ్: జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు సంభవించి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలబారిన పడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం, వైద్య సేవలు అందకపోవడంతో మృత్యువాత పడుతున్న పరిస్థితి. ప్రమాద స్థలాల్లో ఉన్నవారు కూడా పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాలనే అపోహలతో పట్టించుకోని దుస్థితి నెలకొంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం
కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ పథకాన్ని 2021లో తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పోత్రాహ్సకం పొందాలంటే ప్రమాద బాధితులను గంటలోపు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రాణదాత అని పేర్కొంటూ లెటర్‌పాడ్‌పై ప్రమాదాన్ని సంబంధించిన వివరాలతో పోలీసులు కాపీ ఇస్తారు. ఈ కాపీతో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు గాను రూ.5 వేలు నుంచి రూ.20 వేలు వరకు నగదు అందుతుంది. ఏడాదిలో ఎక్కువ మందిని కాపాడిన పది మందిని ఎంపికచేసి రూ.లక్ష చొప్పున బహుమతిగా అందిస్తారు.
ప్రమాదాలు ఇలా..
గత యేడాది జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాలో 917 ప్రమాదాలు సంభవించాయి. 423 మంది చనిపోయారు. 494 మందికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తమ వంతు బాధ్యతగా సహాయక చర్యలు చేపట్టాలి. ప్రజలకు గోల్డెన్ అవర్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. ప్రమాదం సమాచారం అందిస్తే పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని గుర్తించాలి. ప్రమాదం జరిగిన వెంటనే 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తప్పనిసరిగా సమాచారం అందజేస్తే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవు.
– రామానాయుడు, సంగారెడ్డి సీఐ
క్షతగాత్రులను తరలిస్తే రూ.లక్ష నజరానా
అందుబాటులోకి ‘గుడ్ సమారిటన్’ పథకం


