కష్టాలు.. వరుసకట్టె | - | Sakshi
Sakshi News home page

కష్టాలు.. వరుసకట్టె

Mar 20 2026 10:04 AM | Updated on Mar 20 2026 10:04 AM

టిఫిన్‌ ధరల పెంపు

అరకొరగా అల్పాహారాలు పలుచోట్ల టిఫిన్స్‌ ధరల పెంపు చాలాచోట్ల కట్టెల పొయ్యి, బట్టీల వినియోగం ఉమ్మడి జిల్లాలో మూత దిశగా పలు హోటళ్లు

గ్యాస్‌ కొరత.. హోటళ్ల మెనూలో కోత

మ్మడి జిల్లాలోని చాలా హోటళ్లలో వంట గ్యాస్‌ ఎక్కువగా ఖర్చయ్యే వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. సాంబార్‌ తయారు చేసేందుకు పప్పు ఉడకబెట్టడంతో పాటు, బాగా మరిగించాలి. దీంతో గ్యాస్‌ ఎక్కువగా ఖర్చవుతుంది. పలు హోటళ్లలో సాంబార్‌ తయారు చేయడం బంద్‌ చేశారు. వినియోగదారులకు సాంబార్‌ లేకుండానే ఇడ్లీ, వడాలు అందజేస్తున్నారు. అలాగే పలు టిఫిన్‌ సెంటర్లలో దోసె, పూరీలను మెనూ నుంచి తొలగించారు. మెస్‌, హోటళ్లలో మీల్స్‌తో పాటు అందించే ఫ్రై ఐటమ్స్‌, పులుసు లేకుండా అందిస్తున్నారు. ఇండక్షన్‌ స్టౌలను చాలా చోట్ల వినియోగిస్తున్నారు.

గ్యాస్‌ కొరతతో కమర్షియల్‌ సిలిండర్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.1,850 ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధర బ్లాక్‌లో రూ.3,500 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీంతో టిఫిన్స్‌ ఒక్కో దానిపై రూ.10 పెంచి వసూలు చేస్తున్నారు. ఒక్కో టిఫిన్‌పై ధరలు పెంచామని, ఇందుకు సహకరించాలని పోస్టర్లను అంటించారు. గ్యాస్‌ కొరతతో పలు హోటళ్లను బంద్‌ చేస్తుండగా.. అందులో పని చేసే కార్మికులు రోడ్డున పడుతున్నారు.

కొన్ని ఐటమ్స్‌ చేస్తలేం..

గ్యాస్‌ ఎక్కువగా వినియోగమయ్యే కొన్ని ఐటమ్స్‌ బంద్‌ చేస్తున్నాం. బొండా, పూరీ, దోసెలకు ఎక్కువగా ఖర్చవుతుంది. కొన్నింటిని బట్టీ పొయ్యి పెట్టుకొని వాటిని తయారు చేస్తున్నాం. ఎంత కష్టమైనా గ్యాస్‌ తీసుకొచ్చి హోటల్‌ నడుపుతున్నాం.

–నర్సింహారెడ్డి, ఆనంద్‌ దర్శిని హోటల్‌, సిద్దిపేట

మళ్లీ గ్యాస్‌ దొరికితేనే..

గ్యాస్‌ కమర్షియల్‌, డొమెస్టిక్‌ సిలిండర్లు లభించడం లేదు. బంధువులు, తెలిసిన వారిని అడుగుతున్నా లభించడం లేదు. గ్యాస్‌ అయిపోవడంతో హోటల్‌ బంద్‌ చేద్దాం అనుకుంటున్నాం. గ్యాస్‌ కొరతను ప్రభుత్వం తీర్చాలి. గ్యాస్‌ సరఫరాను వేగిరం చేయాలి.

– మనిష్‌, దుర్గమాత టిఫిన్స్‌

కట్టెల పొయ్యి.. బట్టీలు

హోటళ్లలో మళ్లీ పాత పద్ధతిలో వంటలు చేయడం ప్రారంభించారు. పలు హోటళ్లలో కట్టెల పొయ్యి.. బట్టీలతో టిఫిన్లు, వంటలు చేస్తున్నారు. గ్యాస్‌ అందుబాటులోకి రావడంతో కట్టెల పొయ్యి, బట్టీలను బంద్‌ చేశారు. ఇప్పుడు గ్యాస్‌ కొరతతో మళ్లీ పాత వాటికి మరమ్మతులు చేయించి పునఃప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement