సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో కొనసాగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం సాఫీగా సాగుతుందని క్యాంపు ఆఫీసర్ రవీందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత మంగళవారం ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం అవుతుందని, సంబంధిత అధ్యాపకులు విధిగా హాజరు కావాలన్నారు. ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులు ఆయా కళాశాలల లాగిన్‌లో ఉన్నాయని, ప్రిన్సిపాల్స్ అధ్యాపకులను రిలీవ్ చేసి క్యాంపునకు హాజరయ్యేలా చూడాలన్నారు.
ఉపాధి హామీలో అక్రమాలు
రూ.79.485 రికవరీకి ఆదేశం
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీలో పనులు చేయకుండానే మస్టర్లు రూపొందించి నిధులు కాజేయడం.. అధికారుల పర్యవేక్షణ లోపం, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని అధికారులు గుర్తించారు. చిన్నకోడూరులో సోమవారం నిర్వహించిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీలో పలువురి అక్రమాలు బహిర్గతమయ్యాయి. అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్, సామాజిక తనిఖీ బృందం అధికారులు మండలంలో రూ. 6.83 కోట్ల వ్యయంతో 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు చేపట్టిన 967 రకాల పనులపై తనిఖీ బృందం ప్రజావేదికలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.79,485 రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. రూ.46వేలు జరిమాన విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్యాలిటీ కంట్రోల్ సంతోష్ రెడ్డి, విజిలెన్స్ ఆపీసర్ గణేష్, డీఈ బ్రహ్మం, ఎంపీడీఓ జనార్దన్, ఏపీఓ రమేష్, ఈసీ రవి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల హక్కులను
కాలరాస్తే సహించం
డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్
గజ్వేల్: ఉపాధిహామీ కూలీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఉపాధిహామీ పథకం అమలు తీరుపై డీబీఎఫ్ అధ్వర్యంలో సదస్సు జరిగింది. శంకర్ మాట్లాడుతూ.. కూలీల హక్కులను హరిస్తూ.. ఉపాధిహామీ పథకం స్థానంలో వీబీరామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కులవివక్ష కొనసాగుతున్నదని చెప్పారు. సామాజిక సేవకురాలు సుల్తానా మాట్లాడుతూ హక్కుల కోసం మహిళలు నడంబిగించాలన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవ్, రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా కార్యదర్శి వేణు, మండల శాఖ అధ్యక్షుడు చంద్రం తదితరులు పాల్గొన్నారు.
ద్రవ్యోల్బణం అంచనా కోసం సర్వే
బెజ్జంకి(సిద్దిపేట): దేశంలో ద్రవ్యోల్బణం స్థాయిని గుర్తించేందుకు వినియోగదారుల ధర సూచిక సర్వేను నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధికారి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రంలోని నిత్యావసర వస్తువులు, కూరగాయలు, రేషన్ దుకాణాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు వస్తువుల ధరల పెరుగుదల, వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మెదక్‌జోన్: సఖీ, భరోసా సెంటర్లు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కరుణాకర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలతో పాటు బాలసదన్ చిల్డ్రన్ హోమ్‌ను సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.


