భయపెడుతున్న అకాల వర్షాలు
● వాతావరణ మార్పులతో
రైతుల్లో కలవరం
● పాలు పోసుకునే దశలో వరిచేలు
దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి గాలిదుమారంతో పాటు చిరు జల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం
20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొ న్న, బీర్నీస్, కూరగాయ, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు.
పొట్టకొచ్చిన వరి
జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో ఈయాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలను రైతులు వేశారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సంమృద్ధిగా నీరు ఉండడంతో పెద్ద ఎత్తునవరి సాగు చే శారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


