● ఇంటి నుంచే తెచ్చుకుంటున్న తాగునీరు ● ప్రహరీ లేక విష పురుగుల సంచారం ● తుక్కితండాలో సర్కారు బడి దుస్థితి
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల మాట అటుంచితే కొన్ని స్కూళ్లల్లో కనీసం తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలోని తుక్కితండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు తాగునీటి కోసం చిన్నారులు పడరానీ కష్టాలు పడుతున్నారు. అయితే పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. అందులో మొత్తం 25 మంది విద్యార్ధులు ఉండగా, ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఉన్నారు.
ప్రహరీ లేక..
పాఠశాల చుట్టు ప్రహరీ గోడ లేకపోవడంతో లోనికి విషపురుగులు పాములు, తేళ్లు, ఇతర విష కీటకాలు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు కాగా సదరు కాంట్రాక్టర్ గుంతలు తీసి పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో ప్రస్తుతం పాఠశాల ఆవరణలో గుంతలు ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోయారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాగునీటి తండ్లాట..
ప్రస్తుతం ఈ పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేదు. బోరు, బావులు అసలే లేవు. ఆర్వో ప్లాంట్ లేదు.. ఉన్న ఒక చేతిపంపు మాత్రమే చేతులు, కాళ్లు, పేట్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తు న్నారు. తాగడానికి మాత్రం విద్యార్థులే వారి ఇంటి నుంచి ఒక బాటిల్ వాటర్‌ను తెచ్చుకుంటున్నారు. కాగా, మధ్యాహ్నం వరకు ఇంటి నుంచి తీసుకొచ్చిన వాటర్ అయిపోతుందని విద్యార్థులు చెబుతున్నారు. అలాగే టాయిలెట్లు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒంటికి, రెంటికి బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తప్పని అవస్థలు
మా దృష్టికి వచ్చింది
పాఠశాలలో తాగునీటి ఇబ్బందుల విషయం మా దృష్టికి వచ్చింది. జిల్లా ఉన్నతాధికారులకు కూడా చెప్పాం. అలాగే ప్రహరీ గోడ సదరు కాంట్రాక్టర్‌ను త్వరగా నిర్మించాలని సూచించాం. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం.
– గుగులోతు రంగా నాయక్, ఎంఈఓ.


