● ఎల్‌నితో పంటలకు తీవ్ర నష్టం
● అందని ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు
మునిపల్లి(అందోల్): కౌలు రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబ పోషణ కోసం భూములు కౌలుకు తీసుకొని సాగు చేస్తే ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక సతమతం అవుతున్నారు. సర్కారు అందించే పథకాలు, సబ్సిడీలు, పంట నష్టపరిహారం తమకు అందడం లేదని దిగులు చెందుతున్నారు. జిల్లాలో భూమి నాణ్యతను బట్టి ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు చెల్లించి కొంత మంది రైతులు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. ఇంకొంత మంది బోరు బావులు, నీటి సౌకర్యం ఉన్న భూములకు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించి కౌలుకు తీసుకున్నారు. అయితే ఈ సీజన్‌లో పత్తి అనుకున్న స్థాయిలో పండకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. మరో పంట వేయాలా..? వద్దా అని సందిగ్ధంలో ఉన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో ప్రస్తుతం బోరు బావులు అడుగంటాయి. నీరున్నా విద్యుత్ కొరతతో పంటలు సాగు చేస్తే చేతికొస్తుందో లేదోనని చాలా మంది వెనుకంజ వేస్తున్నారు.
పత్తి దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చిందని, దానికి సైతం గిట్టుబాటు ధర దొరకని పరిస్థితి ఏర్పడిందని కౌలు రైతులు వాపోతున్నారు. సీసీఐలో పత్తి క్వింటాల్‌కు రూ.8,667 చొప్పున నిర్ణయించారు. అయితే సీసీఐలో అమ్ముకునే రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. బయట వ్యాపారస్తులు రూ.8700 నుంచి రూ.9,200 లోపు కొనుగోలు చేస్తున్నారు. అందులో సైతం పత్తి నాణ్యతను చూసి ధర నిర్ణయిస్తున్నారని పలువురు చెబుతున్నారు. కౌలుకు తీసుకున్న రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు లేకపోవడంతో వ్యాపారులకే ఎంతకో కొంతకు పంటను అమ్ముకుంటున్నారు.


