రైతులకు మేలు
●సాగు చేయకున్నా రైతులకు పెట్టుబడి సాయం ●ఎల్నినో నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరువు నుంచి రైతాంగాన్ని ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ యాసంగిలో పంటలు సాగు చేసినా, చేయకపోయినా కర్షకులందరికీ రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రైతులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. – నారాయణఖేడ్
ఇప్పటికే వానాకాలం సీజన్లో వర్షాభావంతో దిగుబడులు రాక రైతులు నష్టాలను చవి చూశారు. పెసర, మినుము, సోయా, వరి, నూనెగింజలు ఇతరత్ర పంటల నూర్పిళ్లు అయిపోయాయి. పత్తి, కంది పంటలు మాత్రమే కమతాల్లో మిగిలాయి. పత్తి దిగుబడులు రాక భారీగా రైతులు నష్టపోయారు. కంది పంట కూడా వర్షాభావం వల్ల ప్రస్తుతం పూత దశలో ఉన్న పంట పూత రాలిపోతుండడం వల్ల దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం పంటలు దెబ్బతిన్న రైతులను యాసంగిలో ఆదుకోవాలన్న నిర్ణయంలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతు భరోసా ఇవ్వాలన్న విషయంపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, అధికారవర్గాల సూచనలతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. సరైన సమయంలో పెట్టుబడి సాయం కానీ, కరువు కాలంలో ఇన్పుట్ సబ్సిడీ కింద గానీ రైతు భరోసా నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తగ్గనున్న సాగు విస్తీర్ణం
జిల్లాలో యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశాల ఉన్నాయి. వానాకాలంలో జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 7,09,160 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో అధికంగా పత్తి 3,53,714 ఎకరాల్లో, వరి 1,29,367, కంది 74,715, సోయా 72,326, పెసర 8,343, మినుము 6,319 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది యాసంగిలో 3,09,748 ఎకరాల్లో మాత్రమే రైతులు పంట సాగు చేపట్టారు. వానాకాలంతో పోల్చుకుంటే సంగం విస్తీర్ణం తగ్గింది. అప్పడు వరి 1.31 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే జొన్న 92,497, శనగ 30,908, మొక్కజొన్న 8,798, చెరకు 7,800, తెల్లకుసుమ 6,264 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది యాసంగిలో మరింత భారీగా సాగు తగ్గే అవకాశం ఉంది. అధికంగా రైతులు శనగ, జొన్న, మొక్కజొన్న, తెల్లకుసుమ, నువ్వులు, సన్ఫ్లవర్ తదితర పంటలు సాగును పెంచే అవకాశాలు ఉన్నాయి. వరికి బదులుగా పట్టణాలకు దగ్గరగా ఉన్న చోట్ల, రవాణ అనుకూలత ఉన్న రైతులు కూరగాయల సాగును చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ యాసంగిలో సగం వరకు సాగు తగ్గే అవకాశాలు ఉంది. భూగర్భజలాలు అడుగంటడంతో పెట్టుబడులు నష్టపోతామని రైతులు సాగు తగ్గించే యోచనలో ఉన్నారు.
ఇప్పటికే వానాకాలం పంటల దిగుబడులు రాక నష్టపోయిన రైతులకు ఈ యాసంగిలో ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం వల్ల కొంత ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 3,60,464 మంది రైతులకు రూ.418 కోట్లను రైతు భరోసా కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా, ఇప్పటివరకు పంటలు సాగయ్యే భూములకే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోంది. కానీ ఈసారి సాగు తగ్గినా కరువు పూట రైతులకు పూర్తిస్థాయిలో పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


