● మంత్రి వివేక్
● చిన్నకంజర్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు
పటాన్చెరు టౌన్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి వివేక్ అన్నారు. ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, ఐఎన్టీయుూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, వైస్ చైర్మన్ మదాస్ రాజశేఖర్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇంట్లో కేక్ కట్ చేసి, లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలకు హామీలిచ్చి, ఆశించిన స్థాయిలో నిర్మాణాలు చేపట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం, పెన్షన్లు వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం, యంగ్ ఇండియా పాఠశాలలు, ఉపాధ్యాయ నియామకాలతో విద్యారంగాన్ని బలో పేతం చేస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్‌న్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


