తరాలు గడిచినా.. | - | Sakshi
Sakshi News home page

తరాలు గడిచినా..

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

పాపన్నపేట(మెదక్‌): పాపన్నపేట మండల కేంద్రానికి చెందిన కోనం బేతయ్య, సుగుణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద వాడు దివాకర్‌ ఒకటో తరగతి, రెండోవాడు ప్రభాకర్‌ అంగన్‌వాడీలో చదువుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబానికి ఫూట గడవడమే కష్టం. తరతరాలుగా పల్లెల్లో తిరుగుతూ , పాత సామాను కొని అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నారు. 80 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో పూరి గుడిసె నుంచి పక్కా ఇంటిలోకి, భిక్షాటన నుంచి వంట చేసుకొని తినే పరిస్థితికి మారడమే వారి జీవితంలో వచ్చిన మార్పు. దీపావళి పండుగ రోజు అందరి లాగా టపాసులు పేలుస్తూ ఆనందంతో గంతులేసే బాల్యం అక్కడ కనిపించదు. ఊరంతా రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో వెలిగి పోతుంటే.. బుడగ జంగాల కాలనీ మాత్రం ఎప్పటి లాగే అమావాస్య చీకట్లో.. మిణుకు మిణుకు మనే దీపాల మధ్య మూగబోతోంది. ఉన్నవాళ్ల ఇళ్లలో లక్ష్మిపూజలు జరుగుతుంటే.. ఇక్కడ మాత్రం పేదరికం రాజ్యమేలుతుంది. తోటి స్నేహితులు టపాసులు కాలుస్తుంటే.. ఆ పిల్లలు వారిని చూస్తూ ఆనందపడుతుంటారు. పిల్లలు టపాసులు కొనిచ్చే పరిస్థితి మాకెక్కడిది సారూ అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్కరి బేతయ్య కుటుంబం కథ కాదు. నిజాం రాజ్యంలో అతి పెద్ద రెండో సంస్థానంగా వెలుగొందిన పాపన్నపేట సంస్థానాఽధీశుల సమాధుల పక్కన బతుకు పోరాటం చేస్తున్న రెండొందల మంది బుడగ జంగాల జీవన గాథ ఇది. ఇక్కడ ఉన్న 35 ఇళ్లలో సుమారు 10 కుటుంబాలు, గుడిసెల్లోనే జీవన పోరు కొనసాగిస్తున్నాయి. తరాలు గడిచినా..తల రాతలు మారని సుమారు 200 మంది కళ్లల్లో దీపావళి కనిపించని పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement