● ముగ్గురి రిమాండ్, ఒకరు పరారీ
● 2 కత్తులు, నకిలీ తుపాకీ, స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం ఎస్పీ పరితోశ్ పంకజ్ కేసు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్, పూనే, బారామతి ప్రాంతాలకు చెందిన హసన్ సమీర్ షేక్, సంతోష్ సెగర్ దగుడు, నౌషాద్ జాకీర్ సయ్యద్, రఫీక్ శంషొద్దీన్ షేక్ ముఠాగా ఏర్పడి గత నెల 17 నుంచి 25 వరకు చిరాగ్పల్లి, కోహిర్, సదాశివపేటతో పాటు కర్ణాటక హుమ్నాబాద్ ప్రాంతంలో దారి దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి జాతీయ రహదారి పక్కనే నిలిపి ఉన్న కార్ల వద్దకు వెళ్లి, కత్తులు తుపాకీతో బెదిరించి బంగారు ఆభరణాలతో పాటు నగదును దోచుకొని పరారయ్యారు. చోరీ సొత్తును తమకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా లాతూర్లో బంగారు దుకాణంలో విక్రయించి, వచ్చిన డబ్బులు పంచుకున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు, సీసీఎస్, జహీరాబాద్, సబ్ డివిజన్, సదాశివపేట పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులకు దొరికారిలా..
నిందితులు మరోసారి దారి దోపిడీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. గురువారం రాత్రి హసన్ సమీర్ షేక్, సంతోష్ సెగర్ దగుడు, నౌషాద్ జాకీర్ సయ్యద్ ముగ్గురు కలిసి దోపిడీ చేసేందుకు మహారాష్ట్ర నుంచి నెంబర్ ప్లేటు లేని ద్విచక్ర వాహనంపై జహీరాబాద్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో చిరాగ్పల్లి పరిధిలోని మాడిగి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కాగా నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. జిల్లాలో జరిగిన మూడు, కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ వద్ద దారి దోపిడీ వీళ్లే చేసినట్లు గుర్తించారు. ఇదే దోపిడీలో నిందితుడిగా ఉన్న రఫీక్ శంషొద్దీన్ షేక్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి నకిలీ తుపాకీ, రెండు కత్తులు, మూడు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులపై మహారాష్ట్రలో చోరీలు, దోపిడీ కేసులున్నాయి. సమావేశంలో డీఎస్పీలు సత్తయ్య గౌడ్, సైదా నాయక్, సీఐ రవి, ఎస్ఐలు నరేశ్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.


