కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో తలనీలాలు సేకరించే టెండర్ అక్టోబర్ 31తో ముగిసింది. ఈనెల 1 వతేదీ నుంచి ఆలయ అధికారులు తలనీలాలను నూతన టెండర్ నిర్వహించే వరకు సేకరించుకోవాల్సి ఉంటుంది. కాగా తలనీలాలు సేకరించిన కాంట్రాక్టర్ వెళ్లి పోవాల్సి ఉండగా, సేకరించే బాక్సు, కాంట్రాక్టర్‌కు చెందిన ఉద్యోగి అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో భక్తులు స్వామి వారికి సమర్పించే తలనీలాలు ఏ డబ్బాలోకి వెళ్తున్నాయోనని భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా.. ముగిసిన టెండర్ దారుని బాక్సు, తలనీలాలు సేకరించే గదివద్ద ఉన్నది వాస్తవమేనని తెలిపారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని, కొమురవెల్లికి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ డబ్బాను తొలగించనున్నట్లు తెలిపారు.
పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. ఈ ఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్‌రావు వివరాల ప్రకారం.. గురువారం నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 12 మందిని పట్టుకున్నారు. శుక్రవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా వారికి రూ.14,500 జరిమానా విధించింది.
సిద్దిపేట పట్టణంలో..
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి కోర్టు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 60మంది పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.5,78,000 జరిమానా, వీరిలో ఒకరికి పది, ఆరుగురికి మూడు, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 20మందికి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
చేగుంట(తూప్రాన్): విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముప్పిడి సత్తమ్మ(67) ఇంట్లో వాషింగ్ మిషన్ ప్లగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతురాలి కోడలు రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


