కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని అనంతసాగర్ చౌదరి చెరువులో మొసళ్ల సంచారం కలకలం రేపుతోంది. వివరాలు ఇలా.. చెరువు పరిసర ప్రాంతాల్లో అనేక మంది రైతులకు వ్యవసాయ భూములు ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పంటలకు నీరు పెట్టడం, మోటార్లు ఆన్ చేసేందుకు , పంటలకు కాపలా ఉండటానికి రాత్రి పొలాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే చెరువు కట్టపై మొసళ్లు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అనంత సాగర్ రైతులు ఆందోళన చెందుతున్నారు. చౌదరి చెరువులో మొసళ్ల సంచారంపై అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు, పశువులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, మొసళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


