శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి కొంతాన్‌పల్లి శివారులోని ఓ రైస్ మిల్లులో గురువారం స్థానిక పోలీసుల సహకారంతో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. నిషేధిత గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వ్యక్తి బైండోవర్
బెజ్జంకి(సిద్దిపేట): డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఇరుగు పొరుగు వారితో తరుచూ గొడవలు పడుతున్న అలకుంట సుధాకర్‌ను గురువారం బెజ్జంకి తహసీల్దార్ శ్రీకాంత్ వద్ద బైండోవర్ చేశారు. కాలనీలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు బైండోవర్ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.
విద్యుదాఘాతంతో
ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలు
మద్దూరు(హుస్నాబాద్): విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని గాగ్గిళ్లాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుప్పాల హరీశ్ కొన్నేళ్లుగా గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. గాగ్గిళ్లాపూర్–వల్లంపట్ల గ్రామాల మధ్య 11 కేవీ విద్యుత్ స్తంభం వద్ద ఫ్యూజ్‌వైరు పోయిందని రామచంద్రారెడ్డి అనే రైతు జేఎల్‌ఎం అశోక్ కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని హరీశ్‌ను అశోక్ సూచించారు. ఈక్రమంలో ఫ్యూజ్‌వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో హరీశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా తన భర్తకు విద్యుత్ షాక్‌కు గురయ్యేందుకు కారణమైన జేఎల్‌ఎం అశోక్, ఆపరేటర్ లక్ష్మణ్, రైతు రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య మౌనిక పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆసీఫ్ తెలిపారు.


