జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం తెలిపారు. ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక కళాశాలను గురువారం ఆయన సందర్శించి ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి కళాశాల వసతులు, అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కళాశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన సేవలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కళాశాలకు అవసరమైన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను తనకు అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు, మాజీ కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మంద పాండు, నాయకులు బాల్‌నర్సు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


