సిద్దిపేటకమాన్: బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చడంలో ప్రాసిక్యూటర్ పాత్ర అత్యంత కీలకమని సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. బుధవారం సీపీ కార్యాలయంలో ఈ ఏడాదిలో 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములును సీపీ సన్మానించి, అభినందించారు. 16 కేసులకు గాను 13 కేసులకు సంబంధించి నిందితులకు 20 ఏళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం జైలు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించి, కోర్టు విచారణ సమయంలో పక్కా ఆధారాలు సమర్పించారని తెలిపారు. సమర్థవంతమైన వాదనలతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో ఆత్మరాములు చూపిన చొరవ, నిబద్ధతను కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన సీపీ కనెక్ట్ కార్యక్రమంలో 14మంది పోలీస్ సిబ్బందిని అభినందించారు. అలాగే మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగను పట్టుకోవడంలో సహకరించిన ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, ప్రత్యేక కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు అడ్మిన్ డీసీపీ కుశాల్కర్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్


