కొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లడంతో సుమారు 56 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉందన్నారు. మేదినీపూర్ శివారులో రాజీవ్ రహదారికి ఆనుకొన్ని ఉన్న హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెల్లో నమోదైన ఆధారంగా వ్యక్తి ఫొటోను బయటకు తీశారు. మృతుని ఎడమ చేతిపై పచ్చ బొట్లు ఉన్నాయని, బ్లాక్ కలర్ ఫ్యాంట్ బ్లూ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు..
సంగారెడ్డి క్రైమ్: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. గత నెల 28న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉంది. సిబ్బంది గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వివరాలు తెలిస్తే పట్టణ పోలీసులను సంప్రదించాలని సీఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు..
నర్సాపూర్ రూరల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని ఇబ్రహీంబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంజిత్ రెడ్డి, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగే వెంకటేశం(53), భార్య లక్ష్మి, కొడుకు పవన్‌తో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన వ్యవసాయ పొలంలో స్టార్టర్ డబ్బా నుంచి బోరు మోటారుకు వెళ్లే కరెంటు వైర్ తెగి ఉండటం గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


