హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చట్ట ప్రకారం ఉచిత నిర్బంధ హక్కును కల్పించిందని జిల్లా న్యాయసేవాధికార సభ్యుడు కరుణాకర్ అన్నారు. మంగళవారం కూచన్‌పల్లి జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం, మహిళలు, చిన్నారులపై వేధింపులు, బాల్య వివాహాలు, పోక్సోచట్టం గురించి వివరించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధుమోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థినికి పరామర్శ
మిరుదొడ్డి(దుబ్బాక): హాస్టల్ భవనం పైనుంచి దూకి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల ఉన్నత పాఠశాలలోని మూడంతస్తుల హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాల పాలైన వర్ధిని నిమ్స్ ఆస్పతిల్రో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు అందిస్తున్న చికిత్స వివరాలను అక్కడి వైద్యులను అడిగి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకున్నారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
23 గోవా మద్యం
బాటిళ్ల స్వాధీనం
పటాన్‌చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్ టీటీఎఫ్ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ముత్తంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గోవాకు చెందిన 23 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పటాన్‌చెరు ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు.
250 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.9 లక్షలు
హత్నూర(సంగారెడ్డి): రేషన్ బియ్యాన్ని మహా రాష్ట్రకు లారీలో తరలిస్తుండగా పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో డీటీసీఎస్ డిప్యూటీ తహసీల్దార్ దేవానంద్, ఎస్సై శ్రీధర్ రెడ్డి దౌల్తాబాద్ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పటాన్‌చెరు మండలం పాశమైలారం నుంచి మహారాష్ట్రకు లారీలో తరలిస్తున్న సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు రూ.9 లక్షలు ఉంటుందని తెలిపా రు. కాగా లారీ యజమాని వెంకటరాజు, డ్రైవ ర్ రాజశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీని పటాన్ చెరులోని రేషన్ గోదాంకు తరలించారు. కాగా ఈ నెల 18న కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న 291 క్వింటాళ్ల రేషన్ బియ్యంను దౌల్తాబాద్ చౌరస్తాలో పట్టుపడింది. రాష్ట్రస్థాయి చెక్ పోస్టులతో పాటు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు వాపోతున్నారు.
పాముకాటుతో
యువకుడి మృతి
పెద్దశంకరంపేట(మెదక్): పాముకాటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జమ్లానాయక్ తండా పంచాయతీ పరిధిలోని ఇస్రానాయక్ తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దివ్యాంగుడైన ముడావత్ నరేశ్ (29)ను పాము కాటువేసింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే నరేశ్ మృతి చెందాడు. కాగా మృతుడు ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ కారు పట్టివేత
వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మద్దూరు(హుస్నాబాద్): నకిలీ నంబర్ ప్లేట్‌తో ఉన్న కారును పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వాహనంపై ఉన్న నంబర్ ప్లేట్ వేరే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. నకిలీ నంబర్ టీఎస్–36 ఎం–5844తో ఉన్న కారును పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. మండలంలోని బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన వంగపల్లి సాధును అదుపులో తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


