మెదక్‌జోన్: ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పట్టణ సీఐ మహేశ్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన బాల్‌శెట్టి సులోచన ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ నెల 23న, అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపుకొట్టాడు. తలుపు తెరవగానే నిందితుడు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సులోచన బంగారు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో తెగిపోయింది. కొంత బంగారం ఆమె చేతిలో మిగలగా, మరికొంత భాగాన్ని నిందితుడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా సోమవారం దాయర కాలనీవద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన చాకలి మొగులయ్య అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి పుస్తెలతాడును స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.


