మౌలిక వసతులకు నిధులు | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులకు నిధులు

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

సర్కారు పాఠశాలలకు కేటాయింపు

విద్యార్థుల సంఖ్య

అనుగుణంగా విడుదల

తీరనున్న కనీస సదుపాయాల సమస్య

నారాయణఖేడ్‌: సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, తరగతి గదులు, ఫర్నిచర్‌, డిజిటల్‌ పరికరాలు, ప్రాక్టికల్‌ సామగ్రి తదితర సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల నిర్వహణ కోసం కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ కింద నిధులను విడుదల చేసింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మేలు చేకూరింది.

92 వేల మంది విద్యార్థులు..

సంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,265 ఉండగా ఇందులో సుమారు 92 వేల మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. 10 మోడల్‌ స్కూళ్లలో 6,495 మంది, 22 కేజీబీవీల్లో 4,975, 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,596, నాలుగు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 761 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, స్థానికం సంస్థల పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు నిధులను కేటాయించారు.

ఐదు అంచెలుగా..

జనరల్‌ ఫండ్‌తోపాటు ఎస్సీ కాంపోనెంట్‌, ఎస్టీ కాంపోనెంట్‌ నిధులు కలిపి విద్యార్థుల సంఖ్య అనుగుణంగా పాఠశాలల వారీగా విడుదల చేశారు. ఈ నిధులు ఐదు అంచెలుగా విభజించారు. 30 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.10వేలు, 31 నుంచి 100 మంది ఉన్న చోట రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 251 నుంచి వేయి మంది విద్యార్థులు ఉన్న భారీ పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నిధులు నిర్ధారించారు. 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రస్తుతానికి ఈ నిధులు వర్తించవు.

సదుపాయాలు మెరుగు..

నిధులను పాఠశాలల్లో మంచినీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్‌ చార్జీలు, చిన్నపాటి మరమ్మతులు, ల్యాబ్‌ సామగ్రి, ఇంటర్నెట్‌ బిల్లులు, పాఠశాలల్లో స్వచ్ఛత వంటి అత్యవసర పనుల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులు నేరుగా ఆయా పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నిధుల వినియోగాన్ని పర్యవేక్షించనున్నారు. నిధుల విడుదలతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాల మెరుగు పడనున్నాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యల వల్ల బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది బాలికలు ఈ సమస్య వల్ల పాఠశాలలకు రావడం మానేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం లేక అనారోగ్యాల బారిన పడడం, సైన్స్‌ ప్రయోగాలు, అదనపు పుస్తకాలు చదివే అవకాశాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కనీస సదుపాయాలు ఉంటే విద్యార్థులు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతవరణంలో చదువుకుని విద్యలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement