కొల్చారం(నర్సాపూర్): మండలంలోని ఎనగండ్ల గ్రామంలో పురాతన శిల్పకళా సంపద వెలుగు చూసిందని జిల్లా చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ మంగళవారం తెలిపారు. గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో పురాతన శిల్పాలు, శిల్పకళా ఖండాలు విస్తరించి ఉండటం ఇవి మెతుకు సీమ చారిత్రక వైభవానికి ముఖ్య ఆధారాలని పేర్కొన్నారు. స్థానిక ఆంజనేయ ఆలయం పక్కన నల్లరాతిపై చెక్కిన గజలక్ష్మి శిల్పం అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సాధారణంగా ఆలయ ద్వారబంధాల వద్ద కనిపించే గజలక్ష్మి రూపానికి భిన్నంగా, ఈ శిల్పంలో క్షీరసాగర మధనం దృశ్యాన్ని అద్భుతంగా చెక్కారని తెలిపారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు వాసుకి నాగును ఉపయోగించి సముద్రాన్ని మధిస్తున్న దృశ్యం ఇందులో కనిపిస్తుందన్నారు. గజలక్ష్మి శిల్పానికి మరో వైపున విష్ణుమూర్తి రూపం కూడా చెక్కబడి ఉందని చెప్పారు. ఆలయంలోని యోగశయన మూర్తి శిల్పం కూడా విశేషమైన శిల్పకళకు నిదర్శనమని పేర్కొన్నారు. యోగశయనమూర్తి చుట్టూ దశావతార రూపాలతో పాటు అష్టదిక్పాలకుల ప్రతిరూపాలు చెక్కబడి ఉండటం ఈ శిల్పం కళాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. గ్రామంలోని మరొక ప్రాంతంలో సోమసూత్ర సహిత శివలింగం, అష్టమాతృకల శిల్పాలు, కాలగర్భంలో ధ్వంసమైన అనేక శిల్పఖండాలు ఉన్నాయని తెలిపారు. గ్రామంలోని శిల్పాలను సమగ్రంగా పరిశీలించి, వాటి చారిత్రక నేపథ్యాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


