తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు వెన్నెల
గజ్వేల్: ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటరు ముసాయిదాలో ఓటు గల్లంతైనవారిని పునరుద్ధరించేందుకు గ్రామస్థాయిలో బీఎల్‌ఏలు కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు వెన్నెల అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బీఎల్‌ఏల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిన్న, చిన్న తప్పిదాల వల్ల అర్హులు నోటీసులు అందుకుంటున్నారని, వారందరికీ ఓటు హక్కు దక్కేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనస్తాపంతో
యువకుడు ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ కథనం ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన కాసర్ల దినేశ్(22) ఇంటర్మీడియెట్ విద్యనభ్యసించి జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై మంగళవారం తెల్లవారే సరికి ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: ఎస్‌డబ్ల్యూఎఫ్
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను ప్రారంభించి మాట్లాడారు. కార్మిక సంఘాలతో జరిపిన చర్చలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి సాయిలు, మెదక్ రీజియన్ కార్యదర్శి తుల్జయ్య, రీజియన్ అధ్యక్షుడు అంజాగౌడ్ పాల్గొన్నారు.


