● రెవెన్యూ గ్రామానికి ఒకరి నియామకం ● ఫొటో అప్‌లోడ్‌కు రూ.7 పారితోషికం
జహీరాబాద్ టౌన్: పంటల సాగు వివరాలు లెక్క తీయడానికి వ్యవసాయ శాఖలో వలంటీర్ల నియామకాలు జరుగుతున్నాయి. త్వరలో వీరంతా పంట సర్వే చేపట్టనున్నారు. మండల విస్తీర్ణ అధికారులకు(ఏఈఓ) పరిధి ఎక్కువగా ఉంటుందని, వారికి డిజిటల్ సర్వే చేయడం ఇబ్బందిగా మారండంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమించి సర్వే బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో నియామకాలను చేపడుతున్నారు.
ఏఈఓలు నో చెప్పడంతో..
ఖరీఫ్ సీజన్ పంటల వివరాలను సేకరించాల్సి ఉంది. పనిభారం వల్ల ఏఈఓలు సర్వేకు ససేమీరా అనడంతో ఈ బాధ్యతలను వలంటీర్లకు అప్పగిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశాల మేరకు మండల అధికారులు వలంటీర్ల నియమకాలు చేపడుతున్నారు. ప్రతీ రెవెన్యూ విలేజీకి ఒకరి చొప్పున జిల్లాలో సుమారు 596 మంది వలంటీర్లను వ్యవసాయ శాఖ నియమిస్తోంది. వలంటీర్లు స్థానికులై.. రైతుల భూములు ఎక్కడ ఉందనే వివరాలు తెలియాల్సి ఉంటుంది. బీఎస్సీ చదివి ఉండాలి కానీ ఎవరూ లేకుంటే పదవ తరగతి పాస్ అయిన వారిని నియమించుకుంటున్నారు.
వలంటీర్ల విధులు
వ్యవసాయ వలంటీర్లు రెవెన్యూ గ్రామ పరిధిలోని పంటల వివరాలను సేకరించాలి. శాటిలైట్ ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌లో పంటల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. ప్రతి ఫొటోకు రూ.7 చొప్పున వలంటీర్లకు పారితోషికం చెల్లిస్తారు. వలంటీర్లగా ఎంపికై న వారికి ఆన్‌లైన్ శిక్షణ ఇస్తారు.వలంటీర్ల నియామకాలు పూర్తి కావొస్తుండగా సర్వే పనులు ప్రారంభించి సెప్టెంబర్ నెలాఖరు వరకు సాగు సర్వే పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. వలంటీర్ల నియామకం పూర్తయితే ఏఈఓలకు పనిభారం తగ్గనుంది.
నియామకాలు జరుగుతున్నాయి
పంటల సాగు సర్వే కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు వలంటీర్ల నియామకాలు చేపడుతున్నాం. దాదాపు నియామకాలు పూర్తి కావస్తున్నాయి. త్వరలో వీరికి ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చి యాప్ ద్వారా పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తాం. సర్వే పూర్తి అయితే ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో తెలుస్తుంది.
–శివప్రసాద్,
జిల్లా వ్యవసాయ అధికారి, సంగారెడ్డి


