నర్సాపూర్: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్, సీట్ బెల్టు ధరించడం పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాత్రి గస్తీ పెంచాలని, నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అనంతరం ఎస్పీ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ ఉన్నారు. కాగా కేసుల దర్యాప్తు వివరాలను సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఎస్పీకి వివరించారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో తేనెటీగల పెంపకానికి రైతులు ముందుకు వస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పొందేందుకు తేనెటీగల పెంపకం మంచి ఉపాధి మార్గమని తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం తేనే, మైనం, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా అదనపు లాభం వస్తుందన్నారు. పంటలలో పరాగసంపర్కం పెరిగి దిగుబడి 20 నుంచి 30శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంఐడీహెచ్ పథకం కింద పండ్ల తోటలు, కూరగాయలు, నూనెగింజల పంటలకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకిలోని పీఎంశ్రీ మాడల్ స్కూల్‌లో ఇటీవల జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం చర్యలు తీసుకున్నారు. పాఠశాల పీడీ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పీడీపై దాడి చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ప్రిన్సిపాల్ సంగీత, పీడీ కనకారెడ్డిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు.
గజ్వేల్: మండలంలోని రిమ్మనగూడలోని వ్యవసాయక్షేత్రం ఫెన్సింగ్‌లో చిక్కుకున్న కృష్ణ జింకను మంగళవారం అటవీ శాఖ అధికారులు కాపాడారు. రైతుల సమాచారం మేరకు గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి వినాయక్, సెక్షన్ అధికారి పవన్‌తోపాటు, సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ సందర్భంగా ఫెన్సింగ్ నుంచి జింకను బయటకు తీశారు. కాగా జింక కాళ్లకు స్వల్పంగా గాయాలు కావడంతో గజ్వేల్‌కు తరలించి వెటర్నరీ అధికారి రమేశ్‌బాబుతో చికిత్స చేయించారు. అనంతరం పట్టణంలోని అర్బన్ సమీపంలోగల చెరువు వద్ద సురక్షితంగా వదిలిపెట్టారు.
మృతుడు హైదరాబాద్ వాసి
మిరుదొడ్డి(దుబ్బాక): ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలలోని ధర్మారంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు.. హైదరాబాద్ నగరానికి చెందిన సతీశ్ ధర్మారం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. కాగా సోమవారం రాత్రి భోజనాల తర్వాత మూత్ర విసర్జనకు రోడ్డు ప్రక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన కనకయ్య ద్విచక్ర వాహనంపై వస్తూ అతడ్ని వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జహీరాబాద్ టౌన్: పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో మండలంలోని ఆనేగుంట సర్పంచ్ పొగాకు నరేశ్‌కుమార్‌కు జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీలో జీపీడీపీ ప్రణాళిక కింద చేపట్టిన సీసీ రోడ్డు పనులకు సంబంధించి రూ.7,73,604 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, సర్పంచ్ చెల్లించడం లేదని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ కలెక్టర్, డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు సర్పంచ్ నరేశ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో డీపీఓ కార్యాలయంలో సంజాయిషీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.


