ఆగస్టులో పోటీలు ప్రారంభం
క్రీడాకారులను తీర్చిదిద్దుతాం
నారాయణఖేడ్: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి క్రీడల నిర్వహణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. వీటిపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచనలు చేసింది. క్రీడల సన్నద్ధతలో భాగంగా ఆర్గనైజింగ్ కార్యదర్శుల నియామకాలకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను వివరించారు.
వచ్చే నెలలో నిర్వహణ
ప్రతీ ఏడు తరహాలోనే ఆగస్టులో క్రీడాపోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు నాలుగు దశల్లో నిర్వహిస్తారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలోగా మండల స్థాయిలో పోటీలు పూర్తి చేయాలి. అనంతరం బ్లాక్ (నియోజకవర్గ) స్థాయిల్లో పోటీలు ఉంటాయి. వీటిని నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు రెండో వారంలోగా జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేయాలి. అదే నెలలో నాలుగో వారంలోగా రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ జరుగుతుంది. జిల్లాలో మండల స్థాయి పోటీలను డీఈవో సెలవులో ఉండటంతో రెండో వారంలో ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.
కొన్ని క్రీడలు..
ఎస్‌జీఎఫ్‌లో బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్, విలువిద్య, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, గట్కా, జిమ్నాస్టిక్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, మాడర్న్, మల్కంబ్, పెంటాత్లోన్, నెట్‌బాల్, రగ్బీ క్రీడలు నిర్వహించనున్నారు. షూటింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్ అండ్ డ్రైవింగ్, తైక్వాండో, టెన్నిస్, వాలీవాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ప్రీ స్టైల్, యోగాసనాల తదితర పోటీలు ఉంటాయి. కొన్నింటిని మండల స్థాయిలో నిర్వహించగా మిగతావాటిలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో నిర్వహణకు క్రీడాకారులను ఎంపిక చేస్తారు.
కమిటీల నియామకం
క్రీడా పోటీల నిర్వహణకు అండర్ –14, అండర్ –17 విభాగాలకు పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు, అండర్ –19 విభాగాలకు పీడీలను ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నియామకాలు చేపట్టనున్నారు. వీరి కాలపరిమితి రెండేళ్లు. రెండేళ్లు పూర్తయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంది. నియామకాలు పూర్తయిన వెంటనే రిలీవ్ చేయాలని ఆయా పాఠశాలల నిర్వాహకులకు విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. నియామకాలు పూర్తవగానే మండల, జిల్లా స్థాయిలో క్రీడల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నాయి. మండల స్థాయిలో ఎంఈవో, తహసీల్దార్, ఎంపీడీవోలతో పాటు ఆర్గనైజింగ్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీలో ఆరుగురు సభ్యులుండగా అందులో కలెక్టర్ చైర్మన్‌గా, డీఈవో అధ్యక్షుడిగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌ఫార్మాటిక్స్ ఆఫీసర్, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్, అండర్ 14, 17 ఏళ్ల విభాగపు ఆర్గనైజింగ్ సెక్రెటరీలు సభ్యులుగా ఉంటారు.
మండల, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు
ఆటలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన ఆదేశాలు అందాయి. డీఈవో ఆదేశాల మేరకు గత ఏడాది తరహాలోనే ఆగస్టులో నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తున్నాం.
– శ్రీనివాస్,
ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రెటరీ, సంగారెడ్డి


