స్వాగతం పలికేందుకు వెళ్తూ
నారాయణఖేడ్: ఉమ్రా యాత్రకు వెళ్లి వస్తున్న కూతురు, అల్లుడికి స్వాగతం పలికేందుకు స్కార్పియోలో వెళ్తున్న కుటుంబ సభ్యులు ముగ్గురు మృత్యువాత పడగా, ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచేపల్లి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్‌కు చెందిన షమీమ్‌బేగం కూతురు, అల్లుడు వీరి నాలుగేళ్ల చిన్నారి అనాబియా తక్షీంను అమ్మమ్మ వద్ద ఉంచి ఇటీవల ఉమ్రా యాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున యాత్ర నుంచి కూతురు, అల్లుడు వస్తుండటంతో షమీమ్‌బేగం(50) తన కుమారుడు మొహ్మద్ నదీమ్(30)తోపాటు మనవరాలు అనాబియా తక్షీం(4)తోపాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి స్కార్పియోలో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలు దేరారు. వర్షం పడుతుండటంతో పాటు అతివేగంగా వెళ్తుండటంతో బాచేపల్లి సమీపం 161 జాతీయ రహదారిపై వాహనం డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ సర్వీసు రోడ్డు పైనుంచి రోడ్డు కింది భాగంలోని చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ ఘటనలో షమీమ్ బేగం, మనవరాలు అనాబియా తక్షీం అక్కడికక్కడే మరణించగా, మొహ్మద్ నదీం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో చనిపోయాడు. ఉదయం తెల్లవారు జామును 3.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఖేడ్ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఉన్న మృతదేహాలను చూసేందుకు దెగ్లూర్ నుంచి భారీగా తరలి వచ్చిన బంధువుల రోదనలతో మిన్నంటింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నవీద్‌తోపాటు మరో నలుగురిని సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కల్హేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో తల్లీ, కొడుకు, మనవరాలు మృత్యువాత
తల్లిదండ్రులను చూడకుండానే చిన్నారికి నూరేళ్లు


