‘ఆలు’ పంటకు సస్యరక్షణ అవసరం
జహీరాబాద్ టౌన్: మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలో రైతులు పండిస్తున్న ‘ఆలు’ పంటను సోమవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టీఆర్‌వీకే)సంగుపేట శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ ఆలుగడ్డ పంటలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.నిర్మల, కే.అరుణ మాట్లాడుతూ... ఆలుగడ్డ పంటలో మట్టి ఎగదోసే పద్ధతి (ఎర్తింగ్ అప్) వల్ల దుంపకు సూర్యరశ్మి రక్షణ లభిస్తుందన్నారు. గాలి, నీటి ప్రసరణ సక్రమంగా అంది దుంప బాగా తయారవుతుందన్నారు. దుంత తొలుచు పురుగు, శనగ పచ్చ పురుగుల వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. దీని నివారణకు లీటర్ నీటిలో 0.3 మి.లీ క్లోరంత్రినిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంజోల్ ఏఓ ప్రదీప్‌కుమార్, ఉద్యోగులు శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


