కస్తూర్బాలో కుల వివక్ష
రామాయంపేట(మెదక్): నిజాంపేట కస్తూర్బా పాఠశాలలో కుల వివక్ష రాజ్యమేలుతోంది. స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌ఓ) కుల వివక్ష చూపుతుండటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి నిరసన తెలిపారు. సోమవారం ఎంఈఓ యాదగిరి విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట మండలానికి చెందిన కస్తూర్బా పాఠశాల రామాయంపేట కస్తూర్బా స్కూలులోనే కొనసాగుతోంది. కొంత కాలంగా ఎస్‌ఓ వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థినులు నరకయాతన పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు దూషించడమే కాకుండా, కులంపేరుతో వివక్షకు గురిచేస్తున్నారు.
విద్యార్థినులతో పనులు చేయిస్తూ..
ఇటీవల ఆ మండలానికి చెందిన 21 మంది విద్యార్థినులు పీఈటీతో కలిసి క్రీడల్లో పాల్గొనేందుకు నవంబర్ 20న ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లారు. క్రీడోత్సవాలు పూర్తయిన అనంతరం అక్కడికి దగ్గరలో ఉన్న అయోద్యకు వెళ్లి తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు వారు ప్రసాదాలతోపాటు చేతులకు కట్టుకునే కంకణాలు తమ వెంట తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎస్‌ఓ వేధింపులు అధికమయ్యాయి. వారు చేతులకు కట్టుకున్న కంకణాలు (దారాలు) బలవంతంగా తీసివేయించారు. పాఠశాలకు మంజూరైన ఫర్నిచర్, బీరువాలు, గిన్నెలు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని విద్యార్థినులతో మోయించారు. డీసీఎం నిండా వచ్చిన సామగ్రిని రెండో అంతస్తుకు విద్యార్థినులతోనే మోపించారు. దీంతో కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాలు ఇతరులకు చెబితే టీసీ ఇచ్చి పంపుతానని పలుమార్లు వారిని బెదిరింపులకు గురిచేశారు. ఇదే క్రమంలో వారం రోజుల క్రితం శంకాపూర్ తండాకు చెందిన ఇద్దరు విద్యార్థినుల నానమ్మ మృతిచెందినా ఇంటికి పంపేందుకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వారి తండ్రి పీర్యా వాపోయారు. ఎస్‌ఓ తీరును నిరసిస్తూ కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విషయాన్ని డీఈఓకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిజాంపేట ఎంఈఓ యాదగిరి సోమవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు వెల్లడించిన వివరాలు ఉన్నతాదికారులకు నివేదిస్తామని తెలిపారు.
కంకణాలు తీయించారు
స్కూలు విద్యార్థినులు చేతులకు కట్టుకున్న కంకణాలను ఎస్‌ఓ బలవంతంగా తీయించారు. తలలో పూలు పెట్టుకున్నా దుర్భాషలాడుతున్నారు. విద్యార్థినులను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్న ఎస్‌ఓపై చర్యలు తీసుకోవాలి.
– పద్మ, శంకాపూర్
చర్యలు తీసుకోవాలి
నిజాంపేట కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులను ఎస్‌ఓ తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారు. కుల వివక్షతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. టీసీ ఇచ్చి పంపుతానని తరచూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. ఎస్‌ఓపై చర్యలు తీసుకోవాలి. – గోపాల్, ఔసులపల్లి
ఎస్‌ఓ ఇష్టారాజ్యం
విద్యార్థినులకు నిత్యం వేధింపులు
పాఠశాల ఎదుట తల్లిదండ్రుల నిరసన
విచారణ చేపట్టిన ఎంఈఓ
కస్తూర్బాలో కుల వివక్ష
కస్తూర్బాలో కుల వివక్ష


