సైబర్ మోసాలపై అప్రమత్తం
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్
పటాన్‌చెరుటౌన్: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘మోసాలకు పూర్తి విరామం’(ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్) పేరిట సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. బ్లాక్ మెయిల్, దోపిడీ, డేటా దుర్వినియోగానికి దారితీయొచ్చని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడారు. ఓటీపీ, పెట్టుబడి, పార్శిల్, డిజిటల్ అరెస్టు, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లతో మోసాల గురించి వివరించారు. పోస్టర్లు విడుదల చేశారు. నోడల్ అధికారి డీఎస్పీ కేవీ సూర్యప్రకాశ్, ప్రొఫెసర్ త్రినాథరావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్‌చెరు సీఐ వినాయక్ రెడ్డి, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


