రహదారి విస్తరణ పనులు వేగిరం
● నెల రోజుల్లో నివేదిక సమర్పించండి
● ఎంపీ రఘునందన్ రావు
పటాన్‌చెరు టౌన్: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఆర్‌అండ్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు చేపడుతున్న 65వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై ఆరా తీశారు. బీహెచ్‌ఈఎల్ నుంచి రుద్రారం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా సాగుతూ ఉండడంతో నిత్యం ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం తదితర గ్రామాల పరిధిలో మంచినీటిని సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసం కావడంతో కాలనీలకు మంచినీటి సరఫరా నిలిచిందన్నారు. ఈ కారణంగా తాగునీటి కొరత ఏర్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరణ పనుల్లో వేగం పెంచకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ లాలు నాయక్, విద్యుత్ శాఖ డీఈ భాస్కర్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


