ఉపాధిపై గ్రామసభలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ పథకానికి సంబంధించిన మార్పులు చేర్పులపై కూలీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకం పేరును వీబీ– జీ రాం జీ (వికసిత భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)గా ఖరారు చేసిన విషయం విదితమే. ఈ బిల్లు ఇటీవలే చట్టంగా మారింది. ఈ పథకంలో జరిగిన మార్పులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలందరిని ఈ గ్రామసభలకు పిలిచి పథకంలో కీలక అంశాలను వివరించనున్నారు. ఈనెల 26న ఈ గ్రామ సభలను పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. సభలు పకడ్బందీగా జరిపేందుకు సంబంధిత ఫొటోలను జియోట్యాగింగ్‌తో ఉపాధి హామీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం గ్రామ సభల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది.
1.98 లక్షల మంది రెగ్యులర్ కూలీలు
జిల్లాలో 658 గ్రామాల పరిధిలో ఈ పథకం అమలవుతోంది. 2.08 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 3.72 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 1.98 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌గా ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.74.38 కోట్ల మేరకు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 18 వేల పనులు చేపట్టారు. ఇందులో వివిధ రకాల సుమారు 14 వేల పనులు కొనసాగుతున్నాయి.
ఈనెల 26న జిల్లా వ్యాప్తంగా ఈ సభల నిర్వహణ ?
సన్నాహాలు చేస్తున్న అధికార యంత్రాంగం
జిల్లాలో 3.72 లక్షల మంది ‘ఉపాధి’ కూలీలు
మట్టి పనులకు ఇక మంగళం
ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మట్టి పనులను పూర్తిగా తొలగించింది. ఈ పనులను ఎంపిక చేయవద్దని గత ఆర్థిక సంవత్సరం నుంచే ఆదేశాలు జారీ అయ్యాయి. చెరువుల్లో పూడిక తీత, కందకాలు తవ్వడం వంటి పనులను ఎంపిక చేయలేదు. దీంతో ఆశించిన మేరకు పనులు జరగలేదు. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్‌షెడ్లు, కాలువల నిర్మాణం, నీటి బావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం ఈ పథకం కింద చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను ఇకపై కూడా కొనసాగిస్తారు. ఇప్పటి వరకు ఒక కుటుంబానికి ఏడాదిలో వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు పనిదినాలను 125కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వ్యవసాయ పనులు జరిగే రెండు నెలల పాటు ఈ పథకం పనులను నిలిపివేయనున్నారు. రైతులకు కూలీల కొరత రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


