భద్రతా చర్యలు పాటించాలి
కలెక్టర్ ప్రావీణ్య
హత్నూర(సంగారెడ్డి): ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్ ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హత్నూర మండలం బోరపట్ల గ్రామ శివారులోని ఎపటోరియా పరిశ్రమలో ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ మాధురి, మాక్ డ్రిల్ అబ్జర్వర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాయంత్రం పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి కార్మికుడు భద్రతా చర్యలను తప్పక పాటించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తరచూ పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు. బీహెచ్‌ఇయల్, పాశమైలారం ప్రాంతంలోని పరిశ్రమలలో కూడా ఇలాంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు, డీఎస్పీ ప్రభాకర్ , తాసిల్దార్ పర్వీన్ షేక్, పరిశ్రమ ఇన్‌చార్జి రాజా నరేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణికి 17 దరఖాస్తులు
సంగారెడ్డి జోన్: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 17 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలోని 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, పెండింగ్ పనులు, భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. రహదారి అభివృద్ధి పనులు ఎంతో కీలకమన్నారు. ముందుగా రూపొందించిన పనులు చేపట్టాలని వివరించారు.
పోస్టర్ ఆవిష్కరణ
100 వీకెండ్ వండర్ ఆఫ్ తెలంగాణ పేరుతో నిర్వహించే వినూత్న పోటీకి సంబంధించిన పోస్టర్‌ను యువజన క్రీడా విభాగం జిల్లా అధికారి ఖాసింబేగ్‌తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాలయాలు, తదితర 100 కొత్త ప్రదేశాలను గుర్తించి ఒక టేబుల్ బుక్ కాపీ రూపొందించడమే పోటీ లక్ష్యమన్నారు.


