పల్లెకు పట్టాభిషేకం
● ముస్తాబైన పంచాయతీలు
● 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశ
నారాయణఖేడ్: పల్లెల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. గెలుపొందిన సర్ప ంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండేళ్లుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగింది. సంగారెడ్డి జిల్లాలో 613 సర్పంచ్‌లు, 5,370 వార్డులు, మెదక్ జిల్లాలో 492 సర్పంచ్‌లు, 4,220 వార్డులు, సిద్దిపేటలో 508 సర్పంచ్‌లు, 4,508 వార్డులు ఉన్నాయి. కాగా కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.
కార్యదర్శుల జేబులకు చిల్లు
రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం జేబుల నుంచి పెట్టుబడులు పెట్టిన పంచాయతీ కార్యదర్శులు తమకు బిల్లులు ఎప్పుడు వస్తాయన్న ఆందోళనలో ఉన్నారు. పాలకవర్గాలు లేకపోవడతో రెండేళ్ల పాటు భారం అంతా వారిపైనే పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో నిర్వహణ భారం ఎదుర్కొన్నారు. చెత్త ట్రాక్టర్‌కు డీజిల్ పోసేందుకు జేబులోంచి చెల్లించారు. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, వేతనాలు, పారిశుద్ధ్య పనులకు సైతం చెల్లించారు. గ్రామాన్ని బట్టి ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అప్పులు చేసి వెచ్చించారు.
సవాల్‌గా మారిన సమస్యలు
ఎన్నో ఆశలతో పంచాయతీలోకి అడుడు పెడుతున్న సర్పంచ్‌లకు సమస్యలు స్వాగతం పలుకుతు న్నా యి. రెండేళ్లు పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. పల్లెల్లో కొనుగోలు చేసిన చెత్త ట్రాక్టర్‌లో కనీసం డీజిల్ పోయించుకోలేని దుస్థితికి ఆర్థిక పరిస్థితి చేరింది. డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులతో పాటు ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపులు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, తాగునీటి సరఫరా, కరెంట్ మోటారు మరమ్మతులు.. తదితర సమస్యలన్నీ కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారాయి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లే క గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. బకాయి పడిన లక్షలాది రూపాయల పన్నులు వసూలు చేయా లి. చిన్న పంచాయతీలు, తండాల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. కొన్ని పంచాయతీల్లో రెండేళ్లుగా కిస్తీలు సైతం చెల్లించడం లేదు. దీంతో వడ్డీ భారం పడనుంది.


