ధాన్యలక్ష్మి కటాక్షం కోసం..
రబీ పంట చేలల్లో ప్రత్యేక మండపాలు అంబలి, బజ్జి కూర ప్రత్యేక వంటకాలు, పండ్లతో నైవేద్యాలు
కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని రైతులు శుక్రవారం ఎలామవాస్య పండగ పంట చేలల్లో ఘనంగా జరుపుకొన్నారు. రబీ పంట కాలంలో మార్గశిర అమావాస్యను పురస్కరించుకొని పంట చేనులో ప్రత్యేక మండపాలు, మంచెలు వేసుకొని ఉత్సాహంగా రైతులు వేడుకలు నిర్వహించారు. ధాన్య లక్ష్మిదేవి కటాక్షం కోసం చేనులోని మండపంలో పూజలు చేసి, పండ్లు, ప్రత్యేక వంటకాలైన అంబలి, బజ్జికూర, జొన్న రొట్టెలు నైవేద్యంగా సమర్పించారు. రైతులు సంతోషంగా పంటచేనుల్లో విందు భోజనం ఆరగించి సాయంత్రం అక్కడ వెలిగించిన జ్యోతిని తలపై పెట్టుకొని ఇంటికి చేరుకొన్నారు. ఈ పండగ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మన సరిహద్దు గ్రామాల్లోకి పాకింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి, సిర్గాపూర్, నాగల్‌గిద్దా, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో మాత్రమే జరుపుకొంటారు.
జహీరాబాద్ టౌన్: స్థానిక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎలమా అమవాస్య ప్రాంతీయ పండగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. డిసెంబర్‌లో వచ్చే అమావాస్య రోజున ఖరీఫ్ సీజన్ ముగింపు సూచకంగా ఈ పండగను సాంప్రదాయంగా చేసుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా పప్పుధాన్యాలు, ఆకుకూరలను ఉపయోగించి రుచికరమైన వంటకాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులోభాగంగానే జొన్న, సజ్జ రొట్టెలు, కుడుములు తదితర పిండి వంటలు చేసి కుటుంబ సభ్యులంతా పొలాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ పండుగను కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా చేసుకుంటారు.
ఘనంగా ఎలామవాస్య పండగ


