బొంరాస్‌పేట: పశువులను అపహరించే ముఠాలోని ఓ సభ్యుడిని బుధవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ బాల వెంకటరమణ వెల్లడించారు. హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్‌కు హర్యానాకు చెందిన సౌకత్, తాహిర్, సాబీర్, నట్టతో స్నేహం ఏర్పడింది. వీరు మద్యం, జల్సాలకు అలవాటు పడ్డారు. సులభంగా డబ్బు సంపాధించాలని పశువుల దొంగతనం మొదలు పెట్టారు. రాత్రి పూట కారులో సంచరిస్తూ గ్రామాల్లోని పశువులను గుర్తించేవారు. ఆ తర్వాత వాటిని అపహరించి వాహనంలో నగరానికి తరలించి విక్రయించేవారు. జిల్లాలో తరచూ జీవాలు కనిపించకుండా పోతుండటంతో పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు సమాచారంలో బుధవారం బొంరాస్‌పేటలోని రహదారిపై తనిఖీలు చేపట్టారు. కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును అపగా అందులోని నలుగురు వ్యక్తులు పారిపోయారు. మరో వ్యక్తి మహ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. తనతోపాటు హర్యానాకు చెందిన సౌకత్, తాహిర్, సాబీర్ జిల్లాలోని బొంరాస్‌పేట, పరిగి, చెన్‌గోముల్, దోమ, కుల్కచర్ల, దుద్యాల, ధారూరు, బంట్వారం, పెద్దేముల్, అలాగే నారాయణపేట జిల్లా కోస్గి, మెదక్ జిల్లా శంకరంపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, ఫూచర్‌సిటీ, చేవేళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో మేకలు, గొర్రెలు, ఎద్దులను దొంగతనం చేస్తున్నట్లు మహ్మద్ సల్మాన్ ఒప్పుకున్నాడు. పారిపోయిన నలుగురు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.
పారిపోయిన మరో నలుగురు
పలు జిల్లాల్లో జీవాల అపహరణ
కేసు వివరాలు వెల్లడించిన ఎస్‌ఐ బాల వెంకటరమణ


