నగల దుకాణం నుంచి బంగారు, వజ్రాభరణాలు మాయం | - | Sakshi
Sakshi News home page

నగల దుకాణం నుంచి బంగారు, వజ్రాభరణాలు మాయం

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

బంజారాహిల్స్‌: ఓ నగల దుకాణం లాకర్‌ నుంచి బంగారు, వజ్రాభరణాలు మాయమైన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్‌లోని ఐశ్వి గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌లో లాకర్‌ గదిని ఆ సంస్థ ఉద్యోగి వెంకన్న సాయిరాంరెడ్డి నియంత్రిస్తూ వస్తున్నాడు. అందులోకి ప్రవేశించే అవకాశం ఆయనకు మాత్రమే ఉంటుంది. ఈ నెల 18న సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి లాకర్‌లోని నగలు పరిశీలించగా పలు బంగారు, వజ్రాభరణాలు కనిపించలేదు. మాయమైన వాటిలో 19 గ్రాముల బంగారు గొలుసు, 10 గ్రాముల గొలుసు, 2 గ్రాముల బంగారు కాసు, 2 గ్రాముల డైమండ్‌ ఉంగరం, 12 గ్రాముల బ్లాక్‌ బీడ్స్‌ గోల్డ్‌, 10 గ్రాముల బ్లాక్‌ బీడ్స్‌ గోల్డ్‌, 9 గ్రాముల డైమండ్‌ టాప్స్‌, 13 గ్రాముల డైమండ్‌ టాప్స్‌ ఉన్నాయి. మొత్తం బంగారు ఆభరణాల బరువు 77 గ్రాములు కాగా, వజ్రాల మొత్తం బరువు 3.9 క్యారెట్లు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా వెంకన్న సాయిరాంరెడ్డిని విచారించగా ఓ ఉంగరం మాత్రమే తీసుకున్నానని.. మిగిలి ఆభరణాల చోరీతో తనకు సంబంధం లేదని పోలీసులకు చెప్పాడు.

తండ్రి సమాధిని సందర్శించేందుకు కారు చోరీ

రాజేంద్రనగర్‌: తండ్రి సమాధి వద్దకు వెళ్లేందుకు కారు దొంగిలించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత్తాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మజార్‌ అలియాస్‌ ‘షూటర్‌’, ‘తక్లా’ పాత నేరస్తుడు. గుడిమల్కాపూర్‌, లంగర్‌హౌస్‌, సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గతంలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల విడుదలైన అతడు, మిలాద్‌–ఉన్‌–నబి పండుగను పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా హిలల్‌పూర్‌ నసీర్‌ షా దర్గా సమీపంలోని స్మశానవాటికలో ఉన్న తన తండ్రి సమాధిని దర్శించుకోవడానికి సిద్ధమయ్యాడు.ఈ క్రమంలో ఈనెల 22న పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబరు 169 వద్ద ఉన్న పిస్తా హౌస్‌ వాలెట్‌ పార్కింగ్‌లో షాద్‌నగర్‌కు చెందిన ఉదయ్‌ కిరణ్‌ పార్క్‌ చేసిన కారుపై కన్నేశాడు. వాలెట్‌ పార్కింగ్‌ సిబ్బందిని మాటల్లో దించి దృష్టి మరల్చి, కౌంటర్‌ నుంచి కారు తాళాలు తీసుకున్నాడు. అనంతరం రిమోట్‌ కీ ద్వారా కారును దొంగిలించి, బీదర్‌ వెళ్లేందుకు దాన్ని ఉపయోగించాడు. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అత్తాపూర్‌ పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కారు, ఒక ల్యాప్‌టాప్‌, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

సిగ్నల్‌ జంప్‌ పేరుతో సందేశం..

రూ.3.94 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

శంషాబాద్‌: సిగ్నల్‌ జంప్‌ చేసినట్లు సైబర్‌ నేరగాళ్లు పంపిన ఏపీకే ఫైల్‌తో ఓ వ్యక్తి ఖాతాలోంచి రూ.3.94 లక్షలు కొట్టేసిన వైనం శంషాబాద్‌ డివిజన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన కొమరగోని శివచంద్రనాథ్‌గౌడ్‌ (39)కు మంగళవారం రాత్రి 11.59 గంటలకు ఓ నంబర్‌తో వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది. అందులో సిగ్నల్‌ జంప్‌ చేసినందుకు జరిమానా పడింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసకునేందకు ఆర్‌టీఓ ఈ చలాన్‌ ఏపీకే యాప్‌ను డౌన్‌లౌన్‌ చేయాలని ఉంది. దీంతో సదరు వ్యక్తి ఏపీకే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడానికి ప్రయత్నించినప్పటికి అది డౌన్‌లోడ్‌ కాలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికే అతడికి సంబంధించిన ఆర్‌బీఎల్‌ క్రెడిట్‌ కార్డు నుంచి అతని అనుమతి లేకుండానే విడతలవారీగా రూ. 3.94 లక్షల కట్‌ అయ్యాయి. మోసాన్ని గ్రహించిన వెంటనే ఆర్‌బీఎల్‌ కార్డును బ్లాక్‌ చేసిన సదరు బాధితుడు వెంటనే ఆర్‌జీఐఏ పోలీసులకు పాటు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement