ఏదీ పారిశ్రామిక జాడ! | - | Sakshi
Sakshi News home page

ఏదీ పారిశ్రామిక జాడ!

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం 2020లో అప్పటి ప్రభుత్వం సర్వే నంబర్‌ 252,278లలో 361 ఎకరాల అసైన్డ్‌, ప్రభుత్వ భూములను సేకరించి, టీజీఐఐసీకి అప్పగించింది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 638.36 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు భూములను పారిశ్రామికవేత్తలకు కేటాయించలేదు.

తుక్కుగూడ, మంఖాల్‌, శంషాబాద్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కొంగర, కొత్తూరు, షాబాద్‌ ప్రాంతాల్లో పేరుకే పారిశ్రామికవాడలు

ప్రభుత్వం నుంచి అగ్గువకే భూములు

యూనిట్లు ఏర్పాటు చేయని వైనం

స్థానికులకు దక్కని ఉపాధి ఫలితం

తాజాగా మరికొన్ని గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద సంఖ్యలో భూములు సేకరిస్తోంది. ఇప్పటికే షాబాద్‌ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్‌ రెవెన్యూ సహా మహేశ్వరం, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, బాలాపూర్‌ మండలాల్లో భారీగా భూములు సేకరించిన సర్కార్‌ తాజాగా మరికొన్ని కొత్త పారిశ్రామికవాడల పేరుతో సేకరిస్తోంది. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు పొందిన పలువురు పారిశ్రామిక వేత్తలు.. ఇప్పటికీ ఆయా భూముల్లో పరిశ్రమలు నెలకొల్పలేదు. కొత్తగా మరిన్ని భూములు సేకరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్యాబ్‌సిటీలో 151 ప్లాట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఆదిభట్ల ఐటీఈఎస్‌ పారిశ్రామికవాడలో రెండు, నాదర్‌గుల్‌ పారిశ్రామికవాడలో 13, హార్డ్‌వేర్‌పారు్‌క్‌–2లో 53 ప్లాట్లు, మహేశ్వరంలోని ఈఎంసీలో 101 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ప్లాస్టిక్‌పార్క్‌లో 88 ప్లాట్లు సహా ఎంఎస్‌ఎంఈ ఇబ్రహీంపట్నం పారిశ్రామికవాడలో 81 ఖాళీగా ఉన్నాయి. శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లో టీజీఐఐసీ ద్వారా భూములు పొందిన కొంతమంది రాజకీయ నాయకులు తర్వాత వాటిని రెసిడెన్షియల్‌ జోన్‌లోకి మార్చి భారీ అపార్ట్‌మెంట్లు, ఖరీదైన విల్లాలు నిర్మిస్తుండటం విశేషం. పరిశ్రమలు, భారీ పెట్టుబడులు, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాల పేరుతో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న విలువైన భూముల్లో పరిశ్రమలు రాకపోగా ఉపాధి అవకాశాలు కూడా దక్కడం లేదు.

స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా..

శంషాబాద్‌ పరిధిలో 17 పారిశ్రామికవాడలు ఉండగా, వీటిలో 14 ఇండస్ట్రియల్‌ పార్కుల్లో 4,859.07 ఎకరాల భూమిని 1,009 ప్లాట్లుగా విభజించారు. ఇందులో 541 ప్లాట్లను 2,448 మంది పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. మరో 488 ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇక్కడ భూములు పొందిన కొంతమంది పారిశ్రామిక వేత్తలు షెడ్లు వేశారు. వీరిలో మెజార్టీ లబ్ధిదారులు ఇప్పటికీ ఉత్పత్తులు ప్రారంభించలేదు, ఉద్యోగాలు కల్పించ లేదు. సైబరాబాద్‌జోన్‌లోని మాదాపూర్‌, మణికొండ, రాయదుర్గం, గచ్చిబౌలి, నానాక్‌రాంగూడ, వట్టినాగులపల్లిలోని 14 ప్రాంతాల్లో 3,000 ఎకరాలను వివిధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కేటాయించారు. ఇక్కడ ఆయా దేశాలకు చెందిన కంపెనీలు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ప్రత్యక్షంగా ఏడు లక్షల మందికి, పరోక్షంగా పది లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పాయి. కానీ మెజార్టీ పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పలేదు. పరిశ్రమలు నెలకొల్పని భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement