ఇబ్రహీంపట్నం రూరల్: మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వన మహోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని పోల్కంపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, వసతి గృహాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఇంటికి ఒక మొక్క చొప్పున నాటి కాపాడాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ శేషుకుమార్, గ్రామ సర్పంచ్ గుండ్ల కొండల్ గౌడ్, ప్లాంటేషన్ మేనేజర్ సంధ్య, ఎంపీడీఓ జంగయ్య, ఎంపీఓ ఉష, ఏపీఓ తిరుపతాచారి, ఏపీఎం సాంభశివుడు, పంచాయతీ కార్యదర్శి నాగప్ప, ఉప సర్పంచ్ కావలి వెంకటేశ్, ఈసీ రవికుమార్ పాల్గొన్నారు.
బడంగ్‌పేట్: బాలాపూర్‌లోని గణేశ్ మండప స్థానంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా ఉత్సవ మండపంతో పాటు పార్కింగ్ ఏరియాను పరిశీలించారు. శంషాబాద్ డీసీపీ రాజేష్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, బడంగ్‌పేట సర్కిల్ డీసీ సమ్మయ్య, విద్యుత్ అధికారులు, ఏసీపీలు, బాలాపూర్ సీఐ నాగరాజు, ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: మిలాద్ ఉన్నబీ ఉత్సవాన్ని ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని షాద్‌నగర్ డీసీపీ శిరీష రాఘవేంద్ర అన్నారు. పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో మంగళవారం ముస్లిం మత పెద్దలు, నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రమశిక్షణతో, శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు, సలహాలను విధిగా పాటించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ ముక్తధర్, బాబర్‌ఖాన్, ముబారక్, ఇబ్రహీం, మహబూబ్, అలీం, మన్సూర్ అలీ, జమృద్‌ఖాన్, షర్పొద్దీన్, అజారుద్దీన్, షోయబ్, గౌస్ జానీ, సాధిక్, గౌస్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత శివరామాలయాలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని మంగళవారం జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రాజేశ్వర్ సమక్షంలో లెక్కించారు. మొత్తం 148 రోజులకుగాను హుండీని లెక్కించగా రూ.29,43,801 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మఠం వీరేశం, ట్రస్టీ శిరోలీ, సర్పంచ్ ప్రేమా జవహర్‌లాల్, నిర్వాహకులు, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, కెనరాబ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


