నీట్‌పీజీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌పీజీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్‌పీజీ 2026 పరీక్షను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పరీక్ష నిర్వహణపై అదనపు కలెక్టర్‌ డా.కిరణ్మయి కొప్పిశెట్టితో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏసీపీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) ఆధ్వర్యంలో ఈనెల 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల రిపోర్టింగ్‌ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని, పరీక్ష సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కేంద్రానికి ఒక తహసీల్దార్‌ను నోడల్‌ అధికారిగా, డిప్యూటీ తహసీల్దార్‌ను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌గా, నాయిబ్‌ తహసీల్దార్‌ను సిట్టింగ్‌ స్క్వాడ్‌గా, ఒక పోలీసు సిబ్బందిని కేటాయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళా అభ్యర్థుల తనిఖీల కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. హ్యాండ్‌హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్లతో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, అభ్యర్థుల ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు పత్రాలు, ఆధార్‌/బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తదితర అంశాలను ఎన్‌బీఈఎంఎస్‌ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించాలని తెలిపారు. మొబైల్‌ ఫోన్లు, స్పై కెమెరాలు, ఇయర్‌పీసులు, ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలు, చిట్స్‌, నోట్స్‌ తదితర నిషేధిత వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ విద్యుత్‌ సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్‌ ప్రశ్నపత్రాల డౌన్‌లోడ్‌, అభ్యర్థుల సమాధానాల డేటా అప్‌లోడ్‌ కోసం అవసరమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి సమీపంలోని సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌తో సమన్వయం చేసుకొని సైబర్‌ కమాండ్స్‌ను అప్రమత్తంగా ఉంచాలని చెప్పారు. పరీక్షకు సంబంధించిన తప్పుడు సమాచారం, ప్రశ్నపత్రం లీక్‌, ఇంపర్సనేషన్‌, రూమర్ల వంటి అంశాలపై సోషల్‌ మీడియాను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారి రద్దీని నియంత్రించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సున్నితమైన/అధిక ప్రమాద కేంద్రాల వద్ద మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

రేపు ‘సర్‌’ సభలు

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో గ్రామ/వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా, పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement