మిగిలింది మూడు రోజులే | - | Sakshi
Sakshi News home page

మిగిలింది మూడు రోజులే

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

మిగిలింది మూడు రోజులే విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదు కృష్ణయ్యకు కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారం రోడ్డుపై వరినాట్లు వేసి వినూత్న నిరసన

10లోపు ఎన్యూమరేషన్‌

ఫారాలు సమర్పించాలి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమం తుది దశకు చేరుకుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10తో గడువు ముగియనుందని, జిల్లాలోని అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను సంబంధిత బీఎల్‌ఓకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అసంపూర్ణంగా, తప్పుగా నింపిన ఫారాలతో దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సరైన సమాచారంతో ఫారాలు నింపాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు ఉంటే గడువు ముగిసేలోపు మార్పులు చేయించుకోవచ్చన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి, ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణ, సందేహాల నివృత్తి, వివరాల సవరణ వంటి సేవలు అందిస్తున్నారని తెలిపారు.

కొందుర్గు: ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిబద్ధతతో మెలగాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చౌదరిగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గైర్హాజరైన ఉపాధ్యాయులు, డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను హెచ్‌ఎం సునీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా, భోజనంలో నాణ్యత ఉంటుందా అని ఆరా తీశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.

ఆమనగల్లు: మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మసున కృష్ణయ్య రాష్ట్ర చేనేత జౌలిశాఖ అందించే కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో శుక్రవారం చేనేత జౌలిశాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క చేతుల మీదుగా కృష్ణయ్య పురస్కారం అందుకున్నారు. పురస్కారంతో పాటు రూ.25 వేలు చెక్కు, ప్రశంసాపత్రం, మెమొంటో అందించారు. రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కృష్ణయ్యను పద్మశాలీసంఘం మండల నాయకులు అశోక్‌, శ్రీనివాస్‌ తదితరులు అభినందించారు.

కొందుర్గు: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం తూంపల్లి గ్రామ యువకులు శుక్రవారం రోడ్డుపై వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిందని, ఈ విషయం అధికారులు, పాలకులకు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై గుంతలు పడి వర్షపునీళ్లతో చెరువును తలపిస్తోందని అన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, చందు, గణేశ్‌, రమేష్‌, యాదయ్య, రాకేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement