కొందుర్గు: పట్టుదలతో చదివితే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ ఏడాది పదో తరగతిలో టాపర్‌గా నిలిచిన భరత్ తేజ్‌కు నగదు పురస్కారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన అమ్మమ్మ సత్యమ్మ జ్ఞాపకార్థం ఇటీవల తాను అందించిన రూ.లక్ష విరాళం బ్యాంకులో జమచేసి, వాటిపై వచ్చే వడ్డీ డబ్బులను ఏటా స్కూల్ టాపర్‌కు నగదు పురస్కారం అందించాలని హెచ్‌ఎం కృష్ణకు సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల సౌకర్యార్థం సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంఈఓ కిరణ్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


