ఇబ్రహీంపట్నం: ఆక్రమణలో ఉన్న దండుమైలారం గ్రామకంఠం భూమిపై మండల పరిషత్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భూసాధన కమిటీ ఆధ్వర్యంలో 14 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సర్పంచ్ ఈదులకంటి నరేష్‌గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అదే సమయంలో కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న ఎంపీడీఓ ప్రమీలనాయక్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆమె తన చాంబర్‌లోకి పిలిపించుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. అదే క్రమంలో అక్కడికి వచ్చిన సీఐ మహేందర్‌రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. సర్పంచ్ ఈదులకంటి నరేష్‌గౌడ్ తనకు ప్రాణహాని ఉందని, తనను చంపడంటూ చొక్కా చింపుకోవడం, సమస్యను పరిష్కరించకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంపీడీఓ టేబుల్‌పై పరిచి ఉన్న గ్లాసు అద్దాన్ని ఆందోళకారులు పగులగొట్టడం, పగిలిన అద్దాన్ని చేతపట్టుకోవడంతో సర్పంచ్ చేతికి గాయాలయ్యాయి. ఆయన ఒక్కసారిగా కిందపడిపోవడంతో గందరగోళంగా మారింది. సమాచారం అందుకున్న ఏసీపీ కేపీవీ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. గ్రామకంఠం భూమిపై జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు, సర్వే జరిపి, వివాదాన్ని పరిష్కరిస్తామని ఎంపీడీఓ వెల్లడించడంతో ఆందోళనకారులు శాంతించారు.
సర్పంచ్‌కు పరామర్శ
ధర్నాలో గాయపడిన సర్పంచ్ నరేష్‌గౌడ్‌ను ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామకంఠం భూమిపై గ్రామస్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా
పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం
కిందపడిపోయిన సర్పంచ్, చేతికి గాయం
అధికారుల హామీతో శాంతించిన వైనం


