జనగణనలో తప్పిదాలు ఉండొద్దు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని పలువురు మంత్రులు జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసిన సాధారణం కంటే తక్కువ వర్షపాతం పరిస్థితుల దృష్ట్యా అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో రూపొందించిన కంటింజెన్సీ క్రాప్ ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని, రైతులు అధిక నీటి అవసరమున్న వరి సాగుపై అధికంగా ఆధారపడ కుండా తక్కువ నీటితో సాగు చేయగల పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగా యలు, ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశిష్ సింగ్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారులు వనజాత, హరీష్, జిల్లా వ్యవసాయాధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.
అత్యంత పకడ్బందీగా జనగణన హ్యాండ్ బుక్‌ను రూపొందించాలని, చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకురాలు భారతి హోళికేరీ జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్–డీసీహెచ్‌బీ) రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలో నాణ్యమైన, కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. జనగణన హ్యాండ్‌బుక్ జిల్లా అభివృద్ధి, ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ విధానాల అమలు, పరిశోధనలు, పరిపాలనా అవసరాలకు అత్యంత ప్రామాణిక ఆధార గ్రంధంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్య, వైద్యం, తాగు నీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, చేతివృత్తులు, గ్రామాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు, స్థానిక పరిశీలనలు తదితర తొమ్మిది ప్రధాన విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధికారులతో మంత్రులు


