● పుట్టుకొస్తున్న కొత్త వారసులు
● భూములు తమవేనంటూ పంచాయితీలు
● దాడులు, కేసుల వరకూ వెళ్తున్న వైనం
మంచాల: పల్లెల్లోని గ్రామ కంఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిపై కన్నేసిన కొంతమంది కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఈక్రమంలో చాంద్‌ఖాన్‌గూడ, ఆగాపల్లి గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అస్మత్‌పూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన చాంద్‌ఖాన్‌గూడకు చెందిన పలు ముస్లిం కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఊరిని వదిలి వెళ్లిపోయాయి. ప్రస్తుతం వీరు ఎక్కడున్నారో కూడా తెలియదు. గ్రామంలోని వీరి ఇళ్లు శిథిలావస్థకు చేరి ప్రస్తుతం నేలమట్టమయ్యాయి. ఇలా పెద్ద సంఖ్యలో స్థలాలు ఖాళీగా మారాయి. వీటిపై కొంతమంది స్థానిక ముస్లింల కన్ను పడింది. ఈ నేపథ్యంలో సదరు స్థలాలను కబ్జా పెట్టి మాదంటే మాదంటూ గొడవలు పడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి హంగామా చేస్తున్నారు. మరికొంత మంది సదరు భూములు తమ బంధువులవని, రక్త సంబంధీకులవని అవి తమకే చెందుతాయని ముందుకు వస్తున్నారు. ఇలా గ్రామ కంఠం భూముల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళ్లడంతో బుధవారం విచారణ నిర్వహించారు. ఈ సమయంలో పలువురు వర్గాలుగా విడిపోయి అధికారుల ముందే దాడులు చేసుకున్నారు. అనంతరం పీఎస్‌ను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఆగాపల్లిలో ఆక్రమణ
ఆగాపల్లిలోని పశువుల దవాఖానా ఎదుట ఉన్న గ్రామ కంఠం భూమి కబ్జాకు గురవుతోందని పాలకవర్గం, స్థానిక ప్రజలు పోలీసులు, మండల అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ కంఠం భూమిని ప్రజల అవసరాల కోసం వినియోగించాలని పాలకవర్గం భావించింది. ఈస్థలాన్ని ఎవరూ కబ్జా చేయొద్దని సూచిస్తూ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని తొ లగించిన కొంతమంది, భూమి తమదంటూ కబ్జా కు ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ ఉమ, ఉప సర్పంచ్ యాట రమేశ్ ఆరోపించారు. వాస్తవాలను నిర్ధారించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


