● అదనపు కలెక్టర్ కిరణ్మయి
ఇబ్రహీంపట్నం రూరల్: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వ వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం ఆమె కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాతాశిశు ఆరోగ్య సేవలు పెంచాలన్నారు. జాతీయ టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నియంత్రణకు అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, నేషనల్ డీ వార్మింగ్ డే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన కిట్లు, మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జ్వరాలపై ప్రత్యేక నిఘా, ఇంటింటి సర్వేలతో ప్రజల్లో అవగహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి, ఉప వైద్యాధికారి సత్యరత్న, ఆరోగ్య శాఖల అధికారులు, జిల్లా స్థాయి కార్యక్రమాల అధికారులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.


