సైన్స్ ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి
అపురూప కళాఖండాలు హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్‌లో నాలుగు రోజుల పాటు ప్రదర్శన నిర్వహించనున్నారు.
● యువ శాస్త్రవేత్తల ఎంపికకు నాలుగు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు
● జాతీయ స్థాయిలో నిలిచిన ఇద్దరికి ఏడాదిపాటు భాస్కరా స్కాలర్‌షిప్
కేశంపేట: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తూ సైన్స్‌పై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్షలను నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో 6వ తరగతి–11వ తరగతి వరకు చదివే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 6,7,8 తరగతి విద్యార్థులు జూనియర్ విభాగంలో, 9,10,11 తగరతుల వారు సీనియర్ విభాగంలో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వైజ్ఞానిక అంశాలపై ఆసక్తితో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎన్‌సీఈఆర్టీ, విజ్ఞాన భారతి సంయుక్తంగా పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జాతీయ స్థాయిలో డిజిటల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
● https://vvm.org.in వెబ్‌సైట్‌లో పాఠశాలల నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్, హిందీతో కలిపి 14 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న లెవల్–1 పరీక్ష ఉంటుంది.
నాలుగు దశల్లో పరీక్షలు
● 1వ దశ (పాఠశాల స్థాయి): ప్రతీ అభ్యర్థికి వీవీఎం ప్రశంసా పత్రం అందిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఆన్‌లైన్‌లో మెరిట్ సర్టిఫికెట్ అందజేస్తారు.
● 2వ దశ (జిల్లా స్థాయి): జిల్లా స్థాయిలో 6వ తరగతి –11 వ తరగతి వరకు ప్రతీ తరగతి నుంచి ముగ్గురిని మొత్తం 18 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారికి ఆన్‌లైన్‌లో మెరిట్ సర్టిఫికెట్ అందజేస్తారు.
● 3వ దశ (రాష్ట్ర స్థాయి): జిల్లా స్థాయిలో ప్రతిభచాటిన వారికి పరీక్ష నిర్వహించి 25 మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయి సర్టిఫికెట్ అందిస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
● 4వ దశ (జాతీయ స్థాయి): రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఇద్దరిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున నగదు బహుమతితో పాటు నేషనల్ అవార్డు అందజేస్తారు. జాతీయ స్థాయిలో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున భాస్కరా స్కాలర్‌షిప్ అందజేస్తారు.
పరిశోధన సంస్థల సందర్శన
పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలతో పాటు డీఆర్‌డీఓ, ఐఎస్‌ఆర్‌ఓ, సీఎస్‌ఐఆర్, బీఏఆర్‌సీ వంటి ప్రముఖ పరిశోధన సంస్ధలను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యావేతలు సూచిస్తున్నారు.
ప్రభుత్వ, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠఽశాలల్లో చదివే విద్యార్థులు వీవీఎంను సద్వినియోగం చేసుకోవాలి. ఆయా పాఠశాలల్లోని సైన్స్ ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మరిన్ని వివరాలకు 93953 90985 నంబర్‌లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి


