● అప్పటివరకు సర్వే చేపట్టొద్దు
● అధికారులను అడ్డుకున్న పద్మారం గ్రామస్తులు
కొందుర్గు: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని.. కానీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. బుధవారం భూముల సర్వేకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధిని అడ్డుకోం కానీ భూములు కోల్పోతున్న రైతులకు మరొక చోట భూములు ఇస్తారా..? ప్లాట్లు కేటాయిస్తారా..? లేదంటే ఎకరాకు ఎంత పరిహారం అందజేస్తారో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయపరిహారం ప్రకటించే వరకు భూ సర్వే చేపట్టనీయమని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక పనులు నిలిపివేసి వెనుదిరిగారు. సర్వేకు వెళ్లిన వారిలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంఆర్‌ఐ మహేందర్ గౌడ్, ఇరిగేషన్, సర్వే అధికారులు ఉన్నారు.


