హుడాకాంప్లెక్స్: నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఏర్పాట్లలో భాగంగా బుధవారం సభా వేదిక నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మాజీ మంత్రులు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితారెడ్డి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన వేదిక నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించి సంబంధిత కమిటీలకు పలు సూచనలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేసి, నిరుద్యోగ యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
శంకర్‌పల్లి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దూరదృష్టి ఉన్న నాయకుడని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కితాబిచ్చారు. బుధవారం ఆమె కేటీఆర్ ఆధ్వర్యంలో జన్వాడలో రూ.5 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను తిట్టడమే తప్ప పాలన చేతకావడం లేదని విమర్శించారు. రెండున్నరేళ్లలో 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్‌కు తరలినట్లు చెప్పారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చేతులమీదుగా పాఠశాల భవనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నట్లు తెలిసిందని వారికి అదే రోజు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ శంకర్‌పల్లి మండల, పట్టణాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఎంఈఓ రవీందర్ రావు, నాయకులు రాజు నాయక్, వెంకటేశ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రులు సబితారెడ్డి, తలసాని


