బతుకుల్లో.. కరెంట్‌ చీకట్లు! | - | Sakshi
Sakshi News home page

బతుకుల్లో.. కరెంట్‌ చీకట్లు!

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

19 నెలల్లో విద్యుత్‌ ప్రమాదాల వివరాలు

గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇంట్లో వెలుగులు నింపాల్సిన కరెంట్‌.. కార్మికులు, అమాయక ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే ఇంటి ముందు చెట్ల కొమ్మల మధ్యన వేలాడుతున్న వైర్లు తెగిపడుతున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఫీడర్‌ ట్రిప్పై సరఫరా వెంటనే నిలిచిపోవాలి. కానీ సబ్‌స్టేషన్లలో తలెత్తిన నిర్వహణ లోపాల కారణంగా తీగలు తెగిపడిన తర్వాత కూడా కండక్టర్‌లో విద్యుత్‌ ప్రసరణ కొనసాగుతోంది. ఈ విషయం తెలియని అమాయ క ప్రజలు వాటిని తాకి విద్యుదాఘాతానికి గురవుతున్నారు. ఓవర్‌హెడ్‌ లైన్లు తెగిపడిన వెంటనే సర్క్యూట్‌ బ్రేకై .. రిప్లై ప్రొటక్షన్‌ తెరుచుకుని క్షణాల్లోనే ఫీడర్‌ ట్రిప్పై సరఫరా నిలిచిపోతుంది. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న ఘటనల్లో రిప్లై ప్రొటక్షన్‌ ఎందుకు పని చేయలేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫలితంగా ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం 19 నెలల వ్యవధిలో 25 మంది విద్యుదాఘాతంతో మృత్యువాతపడగా, ఆరుగురు మంచానికే పరిమితమయ్యారు. ఇక మేత కోసం వెళ్లిన 177 పశువులు విద్యుత్‌షాక్‌కు గురయ్యాయి. ఈ ప్రమాదాలకు క్షేత్రస్థాయిలోని ఏఈ, ఏడీఈ, డీఈలదే బాధ్యత. కానీ యాజమాన్యం ఇప్పటి వరకు ఏ ఒక్క ఇంజనీర్‌పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా పేరుతో ప్రతీ మూడు నెలలకోసారి లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌ల నుంచి ఆయిల్‌ లీకేజీల నియంత్రణ, వేలాడుతున్న కండక్టర్‌ను సరిచేయడం, దెబ్బతిన్న కండెన్సర్లు, ఏబీ స్విచ్‌లు, ఫ్యూజ్‌బాక్స్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయిన్పటికీ సరఫరా వ్యవస్థ మెరుగుపడకపోగా.. అనేక మంది మృత్యువాతకు కారణమవుతోంది.

టెండర్‌ దశ దాటని యూజీ కేబుల్‌ పనులు

ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటం, స్తంభాలు విరిగిపోవడం, డీటీఆర్‌లు నేల కూలుతున్నాయి. విపత్తుల సమయంలో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలని భావించిన ప్రభుత్వం ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్‌ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను వేయాలని నిర్ణయించింది. ఏడాది క్రితం సెక్షన్ల వారీగా వివరాలు సేకరించి, ఆ మేరకు అంచనాలు రూపొందించింది. ఓవర్‌ హెడ్‌లైన్లు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే రూ.14 వేల కోట్లకుపైగా అవసరం ఉంటుందని అంచనా వేసింది. మొదటి విడదతలో కోర్‌సిటీలో పనులు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు రూ.4 వేల కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించింది. కాగా ఇప్పటికీ ఆయా పనులు టెండర్‌ దశకూడా దాటలేదు. విద్యుత్‌ ప్రమాదాలు ఆగడం లేదు.

మచ్చుకు కొన్ని ప్రమాదాలు

● జార్ఖండ్‌కు చెందిన చాంపే లేహేంగే(32) బతుకుదెరువుకోసం మొయినాబాద్‌ మండలం కనకమామిడికి చేరుకున్నాడు. శంకర్‌పల్లి మండలం మోకిలాతండలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మార్చే పని కోసం వెళ్లాడు. కనెక్షన్‌ ఇచ్చే క్రమంలో విద్యుత్‌ షాక్‌ కొట్టి చనిపోయాడు. దీంతో ఆయన భార్య, 12 ఏళ్ల కొడుకు అనాథలయ్యారు.

● షాబాద్‌ మండల కేంద్రం ఎస్సీ హాస్టల్‌ వెనుక భాగంలోని ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇటీవల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈదురుగాలులకు తెగిపడిన వైర్లను సరిచేసే పనులను లైన్‌మెన్‌ సాజిద్‌ చేయాల్సి ఉంది. కానీ సంస్థతో ఎలాంటి సంబంధం లేని 17 ఏళ్ల సాయితేజ్‌ను కరెంట్‌ స్తంభాన్ని ఎక్కించాడు. మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై స్తంభంపైనే విగత జీవిగా మారాడు.

● సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.భరత్‌(51) ఇటీవల లైన్‌మెన్‌ రాందాసును వెంట తీసుకుని పిగ్లీపూర్‌లోని సిటీ మీటర్‌ సర్వీసు రీడింగ్‌ తీసేందుకు వెళ్లారు. ఆర్‌–ఫేజ్‌ హెచ్‌జీ ఫ్యూజ్‌ వైరు ఆస్ట్రక్చర్‌ తాకడంతో ఏబీస్విచ్‌ ఆపరేటింగ్‌ పైపునకు విద్యుత్‌ ప్రవహించింది. విధి నిర్వహణలో భాగంగా వీరిద్దరూ 11 కేవీలైనుకు సంబంధించిన ఏబీస్విచ్‌ను ఓపెన్‌ చేసేందుకు యత్నించగా భరత్‌ విద్యుత్‌షాక్‌కు గురై.. అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన లైన్‌మెన్‌ రాందాసు చికిత్స పొందుతున్నాడు. చేతికి గ్లౌజులు వేసుకోక పోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఈ రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని మిగిల్చింది.

షాబాద్‌లో విద్యుత్‌ స్తంభంపై విగతజీవిగా వేలాడుతున్న 17 ఏళ్ల బాలుడు సాయితేజ(ఫైల్‌)

మృత్యుపాశాలుగా మారుతున్న విద్యుత్‌ లైన్లు

ప్రమాదాల కారణంగా 19 నెలల్లో 25 మంది మృతి

ఆరుగురికి గాయాలు.. 177 పశువులు మృత్యువాత

సర్కిల్‌ మృతులు క్షతగాత్రులు మూగజీవాలు

సైబర్‌సిటీ 03 0 63

రాజేంద్రనగర్‌ 10 0 44

సరూర్‌నగర్‌ 04 2 04

వికారాబాద్‌ 08 4 66

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement