పల్లెలకు వచ్చే నిధులు కేంద్రానివే
● బీజేపీ సర్పంచుల గ్రామాలకు రూ.పది లక్షలు ఇస్తా
● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల: గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని బుధవారం బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు పార్టీ తరఫున సన్మాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో బీజేపీ బలం మూడు నుంచి ముప్పైకి చేరిందన్నారు. పంచాయతీల పాలకవర్గాల ఏర్పాటుతో కేంద్రం నుంచి రూ.మూడు వేల కోట్ల నిధులు రానున్నాయని చెప్పారు. ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తన పార్లమెంట్ పరిధిలో రెండు వందల సీసీ రోడ్లకు నిధులు ఇచ్చానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ నుంచి గెలిచిన సర్పంచులకు రూ.10 లక్షల ఎంపీ నిధులను విడుదల చేస్తానని ప్రకటించారు. బీజేపీ దేశం కోసం పనిచేసే పార్టీ అని మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం అన్నారు. అంతకుముందు వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించి సన్మాన సభకు చేరుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంజన్‌కుమార్, ప్రకాశ్, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, నేతలు వైభవ్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, వెంకటరాంరెడ్డి, మానిక్యరెడ్డి, వాసుదేవ్‌కన్నా, రాములు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు అమరేందర్‌గౌడ్, జయశంకర్‌గౌడ్, అనంత్‌రెడ్డి, ఉప సర్పంచ్ పూర్ణచందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో మండలంలోని నాంచేరి సర్పంచ్ పూల్‌మామిడి అశోక్, తన పాలకవర్గం సభ్యులతో కలిసి బీజేపీలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నంల సమక్షంలో చేరారు.


